Share News

స్వచ్ఛ జలం

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:44 AM

జిల్లాలోని పల్లె ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలుకు చర్యలు తీసుకున్నారు. మెగా ఇంజనీరింగ్‌ సంస్థ పనులు దక్కించుకుంది.

స్వచ్ఛ జలం
విజ్జేశ్వరం

వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కదలిక

రూ.1,428 కోట్లతో అన్ని గ్రామాల్లో మంచినీటికి ప్రభుత్వం నిర్ణయం

మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు పనులు

శరవేగంగా క్షేత్రస్థాయిలో సర్వే

విజ్జేశ్వరం వద్ద ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

పైప్‌లైన్‌ మార్గాల్లో సర్వే చేపడుతున్న ఏజన్సీ

త్వరలో పైపులకు ఇండెంట్‌లు

వైసీపీ పాలనలో ముందుకు సాగని పనులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి) :

జిల్లాలోని పల్లె ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలుకు చర్యలు తీసుకున్నారు. మెగా ఇంజనీరింగ్‌ సంస్థ పనులు దక్కించుకుంది. విజ్జేశ్వరం వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించనున్నారు. అక్కడ నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలకు నేరుగా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తారు. గ్రావిటీ ఆధారంగా ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్‌ ట్యాంక్‌ల్లోకి విజ్జేశ్వరం వద్ద ఏర్పాటు చేసే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌నుంచి నీరు చేరిపోనుంది. అలాకాని పక్షంలో సంపుల్లోకి నీటిని మళ్లిస్తారు, అక్కడ నుంచి ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లోకి నీటిని ఎక్కిస్తారు. ఇలాంటి ప్రణాళికలతో గ్రామీణ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేసుకుంటోంది. విజ్జేశ్వరం నుంచి గ్రావిటీతో నీరు సరఫరా అయ్యే మార్గాలను సర్వే చేస్తున్నారు. త్వరలోనే పైప్‌లకు ఇండెంట్‌లు పెట్టనున్నారు. మొత్తంపైన రూ.1,428 కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి గత తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే వాటర్‌ గ్రిడ్‌కు బీజం పడింది. అప్పట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి మంచినీటిని సరఫరా చేసేలా రూ.3,600 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు చేశారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్‌ స్థాయిని కుదించారు. పశ్చిమ జిల్లా వరకే రూ.1,428 కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళిక చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి పనులు ప్రారంభిం పచేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. సర్వేకూడా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్‌గ్రిడ్‌పై దృష్టి పెట్టారు. శరవేగంగా క్షేత్రస్థాయిలో సర్వే పనులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే పైప్‌లకు ఇండెంట్‌లు పెట్టనున్నారు.

రెండో దశ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదన

తొలి దశలో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఉంగుటూరు మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే విజ్జేశ్వరం నుంచి నీరు అందనుంది, దీంతో ఏలూరు జిల్లా పరిధిలోని పలు గ్రామాలు, నరసాపురం తీర ప్రాంతంలో ఇంకొన్ని గ్రామాలకు కలిపేలా రెండోదశ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. అందుకోసం మరో రూ.1400 కోట్లు వెచ్చించనున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే రూ.1,428 కోట్లతో చేపట్టే తొలిదశ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తేనున్నారు. అదే జరిగితే స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేసే మంచినీటిపైనే జనం ఆధారపడుతున్నారు. తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రతి ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. గోదావరి జిలాలను ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. వాటర్‌గ్రిడ్‌ అమల్లోకి వస్తే గోదావరి జలాలు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోనున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:44 AM