నీటికి నిధుల్లేవు..!
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:26 AM
పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.5.5 కోట్లతో ఫిల్టరేషన్ ప్లాంట్ పనులు చేపట్టారు.

మంచినీటి పథకం పనులు జాప్యం
తాడేపల్లిగూడెంలో నిలిచిపోయిన ఫిల్టరేషన్ ప్లాంట్
నిధుల విడుదలలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం
రెండేళ్ల నుంచి బిల్లు చెల్లింపులు పెండింగ్
పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్
తాడేపల్లిగూడెం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.5.5 కోట్లతో ఫిల్టరేషన్ ప్లాంట్ పనులు చేపట్టారు. నిధులు లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2022 డిసెంబర్ 11 మిలియన్ లీటర్ల ఫిల్టరేషన్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. రూ.4.76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రూ.74 లక్షలు మునిసిపాల్టీ నిధులు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో జాప్యం జరిగింది. ఇప్పటికి 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎలక్ర్టోమెకానికల్ ఐటమ్ పనులు నిలిచిపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్‌కు సుమారు రూ.3.కోట్లు చెల్లిం చాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ పనులు చేయడం లేదు. గతంలో సీఎఫ్ ఎంఎస్ ద్వారా నిధులు విడుదల కాగా ఇప్పుడు నిధి పోర్టల్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి రూ.74 లక్షల బిల్లులను నిధి పోర్టల్‌లో తొలిదశగా అప్‌లోడ్ చేశారు. మిగిలిన రూ.2.26 కోట్ల పనులకు సబంధించిన బిల్లులను కూడా త్వరలో అప్ లోడ్ చేస్తామని సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు. నిధు లు విడుదల కాగానే పనులు వేగవంతం చేస్తామంటున్నారు. 11 మిలియన్ లీటర్ల ఫిల్టర్ ప్లాంట్ వద్ద క్లోరిన్, క్లోరినేషన్ ప్లాంట్, ఫిల్టర్‌బెడ్స్, ఆలమ్ ప్లాంట్లు (ఎలక్ర్టోమెకినికల్ ఐటమ్స్) ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది పూర్తిచేస్తే పట్టణంలో నీటి కొరతే ఉండదు.
మంచినీటి చెరువు విస్తరణ
ఇప్పటికే కుంచనపల్లి సమీపంలో 54 ఎకరాల్లో మంచినీటి చెరువును విస్తరించారు. ఈ నీటిని పైపుల ద్వారా పట్టణంలో ఉన్న పంపుల చెరువుకు, 11 మిలియన్ల లీటర్ల ఫిల్టరేషన్ ప్లాంట్‌కు అనుసంధానం చేస్తారు. ముందుగా 11 మిలియన్ లీటర్ల ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తి కాకపోతే రూ.106 కోట్లతో ఏర్పాటుచేసే తాగునీటి పథకం ప్రయోజనం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంచినీటి పఽథకాన్ని రూపొందిం చారు. కడియపుచెరువు విస్తరణకు తొలిదశ రూ.32కోట్లు విడుదల చేయించారు. తరువాత ప్రతిపాడు నుంచి ఏలూరు కాలువ నీటిని కడియపు చెరువుకు మళ్లించేందుకు, కడియపుచెరువు నుంచి పంపుల చెరువుకు నీటిని చేర్చే విఽధంగా పైపులైను ఏర్పాటు రూ.41 కోట్లువిడుదల చేయించారు. అదనపు పైపులైన్ల విస్తరణ ఇతర యంత్రాల ఏర్పాటుకు మరో రూ.32 కోట్లు విడుదల చేయించారు. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపడితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన 11 మిలియన్ లీటర్ల ఫిల్టర్ ప్లాంట్ గుదిబండగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తా. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఇక ఉండవు.
బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే
నిధులు ఆలస్యం కావడం వాస్తవం
ఫిల్టర్ ప్లాంట్ పనులు 75 శాతం పూర్తి కావచ్చాయి. ఎలక్ర్టో మెకానికల్ ఐటమ్ పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టర్‌కు నిధులు విడుదలలో జాప్యం జరిగింది. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలుపుదల చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం.
ఎం.ఏసుబాబు, మునిసిపల్ కమిషనర్