జాబ్ కావాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:21 AM
ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివితే ఇటు ఉద్యోగాలు రాక చిన్న వ్యాపారాలు చేయలేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు.

ఉద్యోగాలు లేక యువత ఆవేదన
సాఫ్ట్‌వేర్ జాబ్‌ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ
హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో హాస్టల్స్‌లో పడిగాపులు
ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ సెటిల్ అయినట్టేననేది పదేళ్ల నాటి మాట. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివితే ఇటు ఉద్యోగాలు రాక చిన్న వ్యాపారాలు చేయలేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇటు ఉద్యోగాలు రాక మరోపక్క ఉద్యోగాల వేటలో నిరసించి అలసిసొలసి బయట పనులకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో యువ ఇంజనీర్‌లు అల్లాడుతున్నారు. ఇక ఉద్యోగాలు రాకపోవడం మరో పక్క నిరుద్యోగు లకు వల వేసి మోసం చేసే బ్యాచ్ పెరిగిపోవడంతో ఇంజనీరింగ్ ఎందుకు చది వాం రా దేవుడా అంటూ బాధపడే పరిస్థితుల్లో నీరుగారిపోతున్నారు. నేటికి ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం బయటకు వచ్చే యువ ఇంజనీర్‌లకు సరిపడా ఉద్యోగాలు అందించకపోవడంతో మరెంత మంది నిరుద్యోగ ఇంజనీర్‌లు రోడ్డున పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీలు
ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చే యువ ఇంజనీర్‌లకు సరిగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో అదే అదనుగా చేసుకుని కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటిలో పది శాతమే ఉద్యోగావకాశాలు కల్పించేవిగా ఉంటుండగా 90 శాతం కన్సల్టెన్సీలు బోగస్‌వి నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. ఆ కన్సల్టెన్సీలు నిరుద్యోగులకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి వారి దగ్గర కొంత సొమ్ము అడ్మిషన్ ఫీజుగా కట్టించుకుంటున్నారు. ఆ ఫీజుతో కొంత వారికి శిక్షణ ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చి ఆనక ఓ బోగస్ కంపెనీలో ఉద్యోగం అంటూ అక్కడ కంపెనీ వారితో లాలూచీ పడి మంచి ప్యాకేజి అంటూ నమ్మించి ఆ ప్యాకేజితో రెండు నెలలు మాత్రమే ఉద్యోగం చేయించి తరువాత బయటకు పంపించేస్తున్నారు. దీంతో కన్సల్టెన్సీలను నమ్మి మోసపోయే వారి సంఖ్య పెరుగుతోంది.
ఉద్యోగం కోసం పడిగాపులు తప్పడం లేదు
నేను 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చాను. క్యాంపస్ ఇంటర్వ్యూలు లేకపోవడంతో బెంగళూరులో కోర్సు చేసి ఉద్యోగం వస్తుందని భావించి కోర్సు పూర్తి చేశాను. తర్వాత ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాలేదు. చివరికి ప్రయత్నిస్తూనే కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేశాను. అక్కడ ఇంటర్వ్యూలకు వెళ్లడానికి సమయం లేకపోవడంతో మానేసి మళ్లి ప్రయత్నించా. అక్కడ ప్రయోజనం లేదని హైదరాబాద్ వచ్చినా అదే పరిస్థితి. నేను చదువుకునేందుకు మా తల్లిదండ్రులకు ఎంత ఖర్చయిందో అంతకు మూడింతలు ఈ రెండేళ్లలో ఖర్చయింది.
– ఎం.వెంకటేశ్, యువ ఇంజనీర్ తాడేపల్లిగూడెం