Share News

ఇసుక సుదూరం

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:51 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ఇప్పుడి ప్పుడే ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో ర్యాంపులకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతించకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇసుక దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి.

ఇసుక సుదూరం

అయినప్పటికీ అందుబాటులో ధర

గాడినపడుతున్న ఉచిత ఇసుక విధానం

జిల్లాలో ర్యాంపులకు అనుమతించని గ్రీన్‌ ట్రిబ్యునల్‌

స్థానిక ర్యాంపులు అందుబాటులో ఉంటే మరింత వెసులుబాటు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ఇప్పుడి ప్పుడే ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో ర్యాంపులకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతించకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇసుక దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి. పెండ్యాల ఓపెన్‌ ర్యాంప్‌ను జిల్లాకు కేటాయించారు. పందలపర్రు ర్యాంప్‌ నుంచి కూడా ఇసుక సరఫరా చేస్తున్నారు. రెండు రీచ్‌ల నుంచి నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానం తొలిరోజుల్లో విమర్శలకు దారితీసింది. లారీ ఇసుక రూ.18 వేల వరకు విక్రయించారు. ప్రభుత్వం ఇసుకపై సీనరేజీ, జీఎస్టీ ఎత్తివేసినా తొలుత ధరలు తగ్గలేదు. ఓపెన్‌ ర్యాంప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆరు యూనిట్‌ల ఇసుక రూ.9 వేలకు లభ్యమవుతోంది. దూరాన్ని బట్టి ఈ ధర పెరుగుతోంది. ర్యాంప్‌లకు దూరంగా ఉన్న భీమవరం ప్రాంతానికి చేరేసరికి ఆరు యూనిట్లు ధర రూ.12 వేలకు ఉంది.

దోపిడీకి అడ్డుకట్ట

ర్యాంప్‌ల్లో తొలుత టన్నుకు రూ.150 అదనంగా వసూలు చేసేవారు. ప్రైవేటు లారీలకు అవకాశం ఉండేదికాదు. ర్యాంప్‌ల వద్ద ఇసుక కోసం క్యూ కట్టేవారు. రెండు రోజులు అయితే గానీ ఇసుక లభించేదికాదు. లారీ అద్దె అదనంగా వసూలు చేసే వారు. మొత్తంగా ఇసుక వినియోగదారులకు ధర తడిసి మోపడయ్యేది. ప్రస్తుతం లారీలు వేచిచూసే పరిస్థితిని అధిగ మించడంతో అదనపు కిరాయి వసూళ్ల దందా నిలిచిపోయింది. రవాణా చార్జీలతోపాటు, తవ్వకం ధరలను వసూలు చేసి ఇసుక సరఫరా చేస్తున్నారు. అదే ఇప్పుడు వినియోగదారులకు కలసి వస్తోంది. సమీప ప్రాంతానికి 6 యూనిట్ల ఇసుక రూ.9వేలకే లారీ ఇసుక లభిస్తోంది. దూరాన్ని బట్టి ఆ ధర రూ.12 వేల వరకు ఉంది. లారీ యజమానులను, మధ్యవ ర్తులను సంప్రదిస్తే ఇసుక దిగుమతి అవుతోంది.

జిల్లాలో ర్యాంప్‌లకు అనుమతి లేదు

జిల్లాలో ఇసుక ర్యాంప్‌లు అందుబాటులోకి రాలేదు. సుము ద్ర తీరానికి దగ్గరగా ఉన్నాయని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతులు ఇవ్వడంలేదు. వైసీపీ హయాంలో నిబంధనలు బేఖాతరు అంటూ ఇష్టానుసారం తవ్వకాలు సాగించేశారు. ఈ ఏడాది అనుమతులు రాలేదు. జిల్లాలో సిద్ధాంతం ర్యాంప్‌ నుంచే అధికంగా ఇసుక సరఫరా చేస్తుంటారు. నడిపూడి, కోడేరు, దొడ్డిపట్ల, యలమంచిలి ర్యాంప్‌ల్లోనూ ఇసుక తవ్వకాలు సా గేవి ఇప్పుడవన్నీ నిలచిపోయాయి. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.

ముందస్తు జాగ్త్రత

నిర్మాణదారులు చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు ముందస్తు గానే ఇసుక నిల్వ చేసుకుంటున్నారు. వర్షాకాలం ర్యాంప్‌లు మూతపడతాయి. ఫలితంగా ఇసుక డిమాండ్‌ ఏర్పడుతుంది. ఇసుక కొరత లేకుండా ఇప్పటినుంచే స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేయాలని జిల్లా అధికారులు ప్రణాళిక రచించారు. స్టాక్‌ యార్డు నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు నరసాపురం, ఉండి ప్రాంతాల్లో స్టాక్‌ పాయింట్‌లు నెలకొల్పారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న స్టాక్‌ యార్డుల్లో ధరలు అధికంగా ఉంటాయని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. దాంతో ముందుగానే నిర్మాణ పనులకు ఇసుక నిల్వ చేసుకుంటు న్నారు. వానాకాలంలో నిర్మాణ అవసరాలకు తగ్గట్టుగా ఇసుక నిల్వ చేసుకుంటున్నారు. మొత్తంపైన ఉచిత ఇసుక విధానం వల్ల తక్కువ ధరకే ఇసుక లభిస్తుండడంతో నిర్మాణదారులు ఊరట పొందుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:51 AM