92 శాతం పింఛన్లు పంపిణీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:47 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు పంపిణీ తొలిరోజైన శుక్రవారం 92 శాతం పూర్తి చేశారు.

ఏలూరు సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు పంపిణీ తొలిరోజైన శుక్రవారం 92 శాతం పూర్తి చేశారు. సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీని ఉదయం 7 గంటలకే ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,61,592 మంది లబ్ధిదారులు ఉండగా రూ.114.25 కోట్లు నిధులను పంపిణీకి విడుదల చేయగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి జిల్లాలో 2,40,196 మంది అంటే 92 శాతం మందికి రూ.104.47 కోట్లు అందజేశారు. ఇంకా 21,396 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. రెండో తేదీ సాయంత్రంలోగా అందుబాటులో వున్న పింఛన్ దారులకు అందజేసి నూరుశాతం పూర్తి చేస్తామని డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తెలిపారు. ఏలూరు నగరంలోని 37, 38 డివిజన్లలోని ఆర్‌ఆర్‌పేట, గుబ్బలవారి వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించి కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. జిల్లాలో కొత్తగా 4,358 స్పౌజ్ పింఛన్‌లను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని ఈ నెలలో పంపిణీ చేస్తామన్నారు. డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రీ స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.