ఆమెకు ఆర్థిక భరోసా
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:20 AM
భర్త మరణంతో ఆసరా కోల్పోయిన మహిళలకు ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ అందజేసి ఆర్థిక భరోసా కల్పించింది.

స్పౌజ్ పింఛన్ల పంపిణీ
జిల్లాలో 3,988 మంది లబ్ధిదారులు
రూ.1.59 కోట్లు అందజేత
రెండేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. భర్త మరణంతో ఆసరా కోల్పోయిన మహిళలకు ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ అందజేసి ఆర్థిక భరోసా కల్పించింది. భర్త మృతి చెందడంతో ఆయన పింఛన్ తమకు ఇవ్వాలని జిల్లాలో పలువురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. గత వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి పింఛన్లు పంపిణీ చేసింది.
భీమవరం టౌన్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 3,988 మందికి సుమారు రూ.1.59 కోట్లు స్పౌజ్ పింఛన్లు శుక్రవారం పంపిణీ చేశారు. ప్రతీ మహిళకు రూ.4వేల చొప్పున అందజేశారు. జిల్లా వ్యాప్తం గా స్పౌజ్ పింఛన్ల పంపిణీ నిర్వహించారు. పింఛన్ పొందిన వారి అభిప్రాయాలను కూడా ప్రజా ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆంధ్రజ్యోతి పెన్షన్ తీసుకున్న మహిళలను పలకరించింది. కొందరు మహిళలు రెండేళ్ల క్రితం దరఖాస్తుచేసుకున్నా స్పందన లేదని, ఇప్పుడు పెన్షన్ సొమ్ము అందించారని ఆనందం వ్యక్తం చేశారు.
94 శాతం పింఛన్లు పంపిణీ
జిల్లాలో ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు శుక్రవారం 94 శాతం పంపిణీ చేశారు. దివ్యాంగులు, వితంతు, మంచాన పడినవారు, చేనేత తదితర పెన్షన్‌లతోపాటు స్పౌజ్, తదితర పెన్షన్ లబ్ధిదారు లు 2.36 లక్షల మంది ఉన్నారు. రూ.97 కోట్లు విడుదల కాగా 2.1 లక్షల మంది లబ్ధిదారులకు రూ.91 కోట్లు శుక్రవారం ఒక్కరోజు పంపిణీ చేశారు. మిగిలిన వారికి శనివారం అందజేస్తారు. జిల్లాలో ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షించారు.