Share News

కనిపించని కాల్వ..!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:37 AM

నరసాపురం– నిడదవోలు పంట కాల్వ బక్కచిక్కుతుంది, దాదాపు తొమ్మిదేళ్లుగా పూడిక పనులు చేపట్టలేదు.

కనిపించని కాల్వ..!
నరసాపురం–నిడదవోలు కాల్వ

బక్కచిక్కుతున్న నరసాపురం పంట కాల్వ

27 మీటర్ల వెడల్పు నుంచి 22 మీటర్లకు కుదింపు

కాల్వ ఆయకట్టు 1.58లక్షల ఎకరాలు

ఎంత నీరిచ్చినా.. శివారుకు అందని పరిస్థితి

నరసాపురం, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): నరసాపురం– నిడదవోలు పంట కాల్వ బక్కచిక్కుతుంది, దాదాపు తొమ్మిదేళ్లుగా పూడిక పనులు చేపట్టలేదు. శివారు భూములకు పుష్కలంగా నీరందని పరిస్థితి నెలకొంది. 27 మీటర్ల ఉండాల్సిన కాల్వ నేడు 23 మీటర్లకు కుచిం చుకుపోయింది. కాల్వ శివారును 12 మీటర్ల వెడల్పు ఉండాల్సిన కాల్వ 8 నుంచి 9మీటర్లకు కుచించుపో యింది. కాల్వకు పుష్కలంగా నీరు విడుదల చేస్తున్నా... శివారు ప్రాంతాలకు ప్రవాహం సాగడం లేదు. ఫలితంగా రైతులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో కాకపర్రు నుంచి వీడిపోయి నిడదవోలు పంట కాల్వ మొగల్తూరు వరకు ప్రవహిస్తుంది. పెర వలి, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సుమారు 1.58 లక్షల సాగు విస్తీర్ణం ఈకాల్వ వెంబడి ఉంది. ఇంత కీలకమైన పంట కాల్వ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైరంది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం నీరు చెట్టు కింద 2016లో పూడిక పనులు చేపట్టారు. అప్పటి నుంచి కాల్వ పూడిక పనులు తీయించలేదు. కాకరపర్రు నుంచి నరసాపురం వరకు 27మీటర్ల వెడల్పు ఉండాల్సిన కాల్వ చాల చోట్ల పూడికతో బక్క చిక్కింది. కొన్ని చోట్ల 24మీటర్లు, మరికొన్ని చోట్ల 22 మీటర్లు ఉంది. అలాగే శివారుకు వెళ్లే కొలది కాల్వ వెడల్పును తగ్గిస్తుంటారు. ఇది 12 మీటర్లు ఉండాల్సి ఉండగా.. కొన్ని చోట్ల 8, 9మీటర్లకు పడిపోయింది.

శివారు భూములకు నీరందని పరిస్థితి..

కీలకమైన నరసాపురం కాలువకు గోదావరి నుంచి 2280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటారు. నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఈ కాలువకు ఇదే లెవెల్‌ను నీటి పారుదలశాఖ ఆధికారులు నిర్వహించడం అనవాయితీ. ఎక్కువ విస్తీర్ణం, శివారు ప్రాంత భూములు ఉండడంతో పుష్కలంగా నీరందించాలని లెవల్స్‌ను తగ్గించరు. కాలువ పూడిపోవడంతో పూర్తిస్థాయి నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ విడుదల చేసినా.. ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఈకారణంగా శివారు భూములకు, కొన్ని సబ్‌ చానల్స్‌లకు పుష్కలంగా నీరందడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

పూడికతీతకు ప్రతిపాదనలు

చెత్తా, చెదారం కాలువలో వేయడం వల్ల చాలా చోట్ల ప్రధాన కాల్వ పూడిపోయింది. పుష్కలంగా నీటిని విడుదల చేస్తున్నా శివారు ప్రాంతాలకు సాగునీరు అందటం లేదు. కాకరపర్రు నుంచి నరసాపురం వరకు కాల్వ తవ్వక పనులు చేపట్టారు. గతంలో కొన్ని నిధులు ద్వారా అక్కడక్కడ పూడిక తొలగించాం. పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం.

– వెంకటనారాయణ, డీఈ, ఇరిగేషన్‌

Updated Date - Aug 03 , 2025 | 12:37 AM