అభద్రతలో..అమ్మతనం!
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:42 AM
దాంపత్య జీవితం లో సంతానం కీలకం. పూర్వకాలంలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వడం ఉమ్మడి కుటుంబాల్లో సాధారణం కాగా, ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల్లో యువజంటలు ఆధునిక పోకళ్లతో ఏళ్ల తరబడి వాయిదా వేయడం పరిపాటైంది.

ఏఆర్టీ/సరోగసీ క్లినిక్ సేవల్లో
పారదర్శకత ఎంత..?
సంతాన సాఫల్యత కోసం ఆశ్రయిస్తున్న యువజంటలు
ఏలూరు అర్బన్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి):దాంపత్య జీవితం లో సంతానం కీలకం. పూర్వకాలంలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వడం ఉమ్మడి కుటుంబాల్లో సాధారణం కాగా, ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల్లో యువజంటలు ఆధునిక పోకళ్లతో ఏళ్ల తరబడి వాయిదా వేయడం పరిపాటైంది. 21వ శతాబ్దపు దాంపత్యంలో జననాల సంఖ్య గణనీయంగా పడిపోతుండగా, మరోవైపు పనిఒత్తిళ్లు, మూడుపదుల వయస్సు దాటినా వివాహాలకు దూరంగా ఉండడం, శారీరక, ఆరోగ్య సంబంధిత సమస్యలు, తదితర అంశాలు పిల్లల పుట్టుకపై పెనుప్రభా వాన్నే చూపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ పద్ధతుల్లో బిడ్డకు జన్మనిచ్చే పద్ధతులు వేగంగా విస్తరిస్తున్నాయి. సంతాన సాఫల్యత కోరుకునే జంటలు విభిన్న కారణాలతో వీటిని ఆశ్రయిస్తున్నాయి. ఇటువంటి దంపతులకు సంతానభాగ్యం కలిగించేందుకే సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న డిమాండ్ కను గుణంగానే మోసపూరిత మైన విధానాలను పాటించే వాటిబారిన పడి ఆర్థికంగా నష్టపోయినవారూ లేకపోలేదు. ఇటీవలే సరోగసి విధానంలో శిశువు జన్మించిందంటూ ఓ యువజంటకు వేరే రాష్ట్రంలో కొనుగోలు చేసిన నవజాత శిశువును అప్పగించి ఘరానా మోసానికి పాల్పడిన ఓ వైద్యురాలి ఉదంతం తెలిసిందే. ఈ ఉదంతం తెలుగురాష్ట్రాల్లో కలకలానే సృష్టించింది.
నిబంధనలు అత్యంత కఠినతరం
జిల్లాలో ఏలూరులో రెండు, నూజివీడులో ఒకటి ఏఆర్టీ(అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) సెంటర్లున్నాయి. వీటి ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పకడ్బందీగా నిబంధనలను 2021లోనే చట్టంలో రూపొందించింది. ఆ ప్రకారం ఏఆర్టీ/ సరోగసీ క్లినిక్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్, స్కానింగ్ సెంటర్ ఉండాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ రిజిస్ట్రీ, ఏఆర్టీ రెగ్యులేషన్ చట్టం–2021కి అనుగుణంగా 81 రకాల నిబంధ నలను పాటించాలి. ఏఆర్టీ లెవెల్–1 క్లినిక్‌లో గర్భధారణకు ప్రాథమిక వైద్యపరీక్షలను మాత్రమే చేయాలి. లెవెల్–2 క్లినిక్‌లలో అడ్వాన్స్‌డ్ వైద్యపరీక్షలు, పునరుత్పత్తి ప్రక్రియలను చేయవచ్చు. ఏఆర్టీ బ్యాంక్‌లలో దాతనుంచి వీర్యాన్ని(స్పెర్మ్) సేకరించి భద్రపర్చవచ్చు. వీటిని ఏర్పాటు చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత రుసుం చెల్లించాలి. కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా బోర్డులో డీఎంహెచ్‌వో వైస్ చైర్మన్‌గా, ఒక మహిళా సంఘం ప్రతినిధి, న్యాయనిపుణుడు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సభ్యులుగా వున్న కమిటీ పరిశీలించి, ఐసీఎంఆర్ చెక్‌లిస్టు ప్రకారం అన్ని నిబంధనలను పాటించిన వాటికి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన అనుమతినిస్తుంది. ఇన్‌ఫెర్టిలిటీ/ఏఆర్టీ/సరోగసీ విధానంలో గర్భధారణ కోసం క్లినిక్‌లకు విచ్చేసే దంపతుల వివరాలు, వారికందించే వైద్యం, మందులు, సరోగసీ తల్లి వివరాలు, తదితర సమగ్ర సమాచారాన్నంతటినీ ఎప్పటికప్పుడు నిర్వాహకులు నేషనల్ రిజిస్ట్రీలో నమోదు చేయడంతో పాటు, డీఎంహెచ్‌వో కార్యాలయానికి తెలపాలి. ఏఆర్టీ లెవెల్–1 క్లినిక్‌లో గైనకాలజిస్టు, అండ్రాలజిస్టు, మోటివేటర్ తప్పనిసరిగా ఉండాలి. లెవెల్–2 క్లినిక్‌లో డైరక్టర్, అనస్థిటిస్టు, గైనకాలజిస్టు, అండ్రాలజిస్టు ఉండాలి. ఏఆర్టీ/సరోగసీ విధానంలో పేషెంట్ల నుంచి ఆయా సేవలకు వసూలు చేయడానికి అధికారికంగా ఫీజులను ప్రభుత్వం నిర్ణయించలేదు. ఫలితంగా దంపతుల అవసరతను బట్టి సగటున ఒక్కో సరోగసీ కేసుకు రూ.ఎనిమిది నుంచి రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంలోనే వసూలు చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
జిల్లాలో ఏలూరులో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(లెవెల్–1), ఫెర్టిలిటీ సెంటర్(లెవెల్–2), నూజివీడులో నర్సింగ్ హోం(లెవెల్–2) వైద్యఆరోగ్య శాఖ వద్ద రిజిస్టరై ఉన్నాయి. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటి వరకు ఆరు కేసులు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. ముఖ్యమైన కేసులన్నీ విజయవాడకు వెళుతున్నాయని మా పరిశీలనలో గమనించాం. ఈ క్లినిక్‌లన్నింటిలో అర్హులైన వైద్యులున్నారు. పేషెంట్ల వైద్యానికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. క్లినిక్‌లలో పనిచేసే సిబ్బంది వివరాలను బహిరంగంగా కనబడేలా ప్రదర్శించా లని ఆదేశించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధన లన్నింటినీ క్లినిక్‌లు పక్కాగా అమలు చేయకపోతే చర్యలు తప్పవు.
– డాక్టర్ పీ.జే.అమృతం, డీఎంహెచ్‌వో