Share News

తాకట్టు తకరారు

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:35 AM

ప్రతి కుటుంబంలో ఏటా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేవారు. ఇంతలో ఇంటిలో ఏదైనా అత్యవసర పనిపడితే అదే బంగారాన్ని మార్వాడీ వద్ద తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునేవారు.

తాకట్టు తకరారు

ధర పెరగడంతో కొందరు తాకట్టులో విడిపించి విక్రయం

మరికొందరు ఏళ్లనాటి తాకట్టు వస్తువులు ఏమయ్యాయంటూ ప్రశ్నలు

షాపుల వద్ద ఘర్షణలు.. తలలు పట్టుకుంటున్న బంగారు వ్యాపారులు

భీమవరం క్రైం/ఆకివీడు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబంలో ఏటా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేవారు. ఇంతలో ఇంటిలో ఏదైనా అత్యవసర పనిపడితే అదే బంగారాన్ని మార్వాడీ వద్ద తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునేవారు. డబ్బులు సర్దుబాటు అయిన తర్వాత వడ్డీలు కట్టి విడిపించుకునేవారు. ఈ తంతు కొన్ని దశాబ్దాలుగా కొనసాగు తూనే వుంది. అప్పట్లో బంగారం ధర నిలకడగా ఉండేది. ఒక్కసారి ధర పెరిగిందంటే ఏడాదిపాటు అదే ధర కొనసాగేది. దీంతో అటు తాకట్టు పెట్టినవారికి, ఇటు వ్యాపారులకు అంత ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుతం బంగారం ధర చుక్కలను అంటడంతో తాకట్టు పెట్టిన వారు పరుగులు పెడుతున్నారు. తాకట్టు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాసుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరగడంతో కొందరైతే తాకట్టు విడిపిస్తున్నారు. మరికొందరైతే వస్తువుకు ధర కట్టి అసలు, వడ్డీ పోను మిగిలిన డబ్బులు ఇవ్వమంటూ వ్యాపారులపై ఒత్తిడి చేస్తు న్నారు. వ్యాపారులు ఒకరోజు ఉన్న ధర మరో రోజు ఉండకపోవడంతో బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏమవుతుందోనన్న ఆలోచనలో పడుతున్నారు.

వ్యాపారాలు తగ్గడంతో దుకాణాలు డల్‌

బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో వ్యాపా రం తగ్గిపోయింది. ధరలో గంట గంటకు మార్పు లు వస్తుండడంతో కొనుగోళ్లు తగ్గిపోయాయని వర్త కులు చెబుతున్నారు. ఫలితం దుకాణం అద్దె, కరెం టు బిల్లు, వర్కర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇది చాలదన్నట్లు తాకట్టు పెట్టినవారు ఒక్కసారిగా వచ్చి వస్తువులను విక్రయించడానికి వస్తుండంతో వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు నాలుగేళ్ల క్రితం తాకట్టు పెట్టినవారు తమ వస్తువులు కావాలంటూ ఇప్పుడు ఒత్తి డి చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఏదైనా వస్తువుతాకట్టు పెట్టుకుంటే ఏడాది నుంచి ఏడాదిన్నర వరకే అవి ఉంటాయని, తాకట్టు ధ్రువపత్రాల్లో నిబంధనల్లో పేర్కొంటారు. ఏడాదిలోపు వచ్చి వడ్డీ చెల్లిస్తే ఆ తాకట్టును మళ్లీ తిరిగి రాసి మళ్లీ ఏడాదిపాటు యధావిధిగా కొనసాగిస్తారు. కొందరుకొనుగోలుదారులు అప్పట్లో ధర లేకపోవడంతో వస్తువులు విడిపించుకోలేని స్థోమత అంతంతమాత్రంగా ఉండటం తో వీటిని తీసుకుని వెళ్లేవారు కాదు. దీంతో వ్యాపారులకు నోటీసులు పంపించి వేలానికి పంపించే వా రు. అయితే ప్రస్తుతం వచ్చి మా వస్తువులు కావాలంటూ వ్యాపారులను నిలదీస్తూ ఉండటంతో వీరు తలలు పట్టుకుంటున్నారు. వస్తువులు లేకపోయినా ఆ రశీదును బట్టి తూకాన్ని చూపించి ధరలు కట్టి మిగిలిన సొమ్మును తాకట్టు పెట్టిన వారికి ఇవ్వాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

‘బంగారం తాకట్టు పెట్టిన సమయం దాటిపోతోంది. త్వరగా వచ్చి సొమ్ములు చెల్లించి, మీ బంగారాన్ని విడిపించుకోండి. లేకపోతే వేలానికి వెళ్లిపోతుంది’ అని ఒకప్పుడు బంగారం వ్యాపారులు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఒకటికి రెండుసార్లు ఫోన్‌లు చేసినా విడిపించుకునేవారు కాదు. నోటీసులు ఇచ్చినా స్పందించేవారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు తాకట్టు బంగారం విడిపించుకోవడానికి షాపుల వద్దకు క్యూ కడుతున్నారు. బంగారంపై తాము తీసుకున్న అసలు, వడ్డీ చెల్లిస్తాం. బంగారం ఇవ్వాలంటున్నారు. అయితే బంగారం మీద అప్పు ఇచ్చిన వర్తకుడు గడువు దాటిపోవడంతో వేలం వేసేశామని చెప్పడంతో గొడవలకు దిగుతున్నారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని పట్టణాల్లోనూ కనిపిస్తోంది.

ఇటీవల భీమవరం మండలానికి చెందిన ఒక మహిళ పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణాల వద్దకు వచ్చింది. తాను కరోనా సమయంలో ఐదు కాసులు బంగారు వస్తువులు రెండు లక్షల రూపాయలకు తాకట్టు పెట్టానని, ఆ వస్తువులు బయటకు తీయండంటూ యజమానిని కోరింది. అయితే యజమాని మీకు నోటీసులు వచ్చాయా అని అడిగాడు. తాకట్టు పెట్టిన ఏడాది అనంతరం నోటీసులు వచ్చినట్లు ఆమె పేర్కొంది. అయితే దుకాణ యజమాని మాత్రం ఆ వస్తువు వేలానికి వెళ్లిపోయింది.. ప్రస్తుతానికి ఏమీ లేదని తెలపడంతో ఆ మహిళ బంధువులను పిలిపించి ఆ దుకాణం వద్ద పెద్ద రాద్ధాంతం చేసింది. చివరకు చేసేది లేక ఆ వస్తువుకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రేటు కట్టి మిగిలిన సొమ్మును ఆ మహిళకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యాపారి బాగా నష్టపోయాడు.

ఉండి మండలానికి చెందిన ఒక మహిళ ఏడాది క్రితం భీమవరం పట్టణంలో ఒక దుకాణంలో మూడు కాసుల బంగారు వస్తువులను తాకట్టు పెట్టింది. ఏడాది తర్వాత వచ్చి ఆ వస్తువును విడిపించింది. అయితే తాను పెట్టిన వస్తువుకు మూడు కాసులు కాదు నాలుగు కాసులంటూ యజమానితో గొడవకు దిగింది. ఆ మహిళ సంతకాలు ఆ తేదీని బట్టి చూపించడంతో తనకు చదువు లేదని తెలియక సంతకం పెట్టానంటూ చెప్పడంతో యజమాని సంఘ సభ్యులను పిలిపించి ఆమెకు నచ్చచెప్పారు. ఇటీవల కాలంలో భీమవరం పట్టణంతోపాటు నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

Updated Date - Apr 27 , 2025 | 01:35 AM