Share News

మా రికార్డులు.. మాకున్నాయి!

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:37 AM

లంచం ఇస్తేనే చెరువులు సాగు చేయాలనే ధోరణితో తమను భయబ్రాంతులను చేసి దోచుకోవడమే లక్ష్యంగా కొల్లేరులో ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.

మా రికార్డులు.. మాకున్నాయి!
చేపల చెరువులకు గండి కొట్టడంతో నీట మునిగిన వరిచేలు

సరిహద్దులు చూపకుండానే చేపల చెరువులకు గండ్లు!

వరి చేలల్లోకి చేరిన చెరువుల నీరు

ఫారెస్టు అధికారుల ఒంటెద్దు పోకడలు

లంచం ఇస్తేనే సాగు.. ధోరణిలో కక్ష సాధింపు : బాధిత చెరువుల రైతులు

పంట నష్టపోయాం.. న్యాయం చేయాలి : వరి రైతుల ఆవేదన

నిడమర్రు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : లంచం ఇస్తేనే చెరువులు సాగు చేయాలనే ధోరణితో తమను భయబ్రాంతులను చేసి దోచుకోవడమే లక్ష్యంగా కొల్లేరులో ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క కొల్లేరులో వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి సాధికారిక కమిటీ పర్యటన ఖరారవుతున్న నేపథ్యంలో ఫారెస్టు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తమ భూమి సర్వే నిమిత్తం స్థానిక సచివాలయంలో కొలతలకు దరఖాస్తు చేసుకున్నారు. మే 3వ తారీకున సర్వే చేస్తామని అధికారులు తెలి పారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ‘మా రికార్డులు.. మాకున్నాయి’ అంటూ ఏకపక్ష ధోరణితో రైతులపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారెస్టు అధికారుల అనాలోచిన చర్య వల్ల తాము నష్టపోయా మంటూ వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి బాధిత రైతులు తెలిపిన వివరాలివి..

నిడమర్రు మండలం పెదనిండ్రకొలను – నిడమర్రు శివారు కొల్లేరు సరిహద్దు ప్రాంతంలో 16 ఎకరాల విస్తీర్ణంలోని రెండు చేపల చెరువులకు శనివారం ఫారెస్టు అధికారులు ఇరువైపులా గండ్లు కొట్టారు. అయితే చెరువుల్లో మా జిరాయితీ భూములు ఉన్నాయని, సర్వేకు దరఖాస్తు చేశామని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని, సరిహద్దులు చూపకుండానే గండ్లు కొట్టేశారని బాధిత రైతులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గండి కొట్టిన చెరువుల నుంచి నీరు సుమారు కిలోమీటరు దూరంలోని కోతకు సిద్ధమైన వరిచేలల్లో మోకాలు లోతు నిలిచింది. దీంతో ఏడెకరాల వరిపొలం పూర్తిగా నీటమునిగింది. సుమారు 8 లక్షల రూపాయల విలువైన పంట నష్టపోయామని, దీనికి బాధ్యత ఎవరిదని బాధిత వరి రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై డీఎఫ్‌వో బి.విజయలక్ష్మి వివరణ ఇస్తూ గండి కొట్టిన చెరువుల్లో అసలు జిరాయితీ భూమి లేదని శాటిలైట్‌ సర్వే ద్వారా తెలుస్తోందని, ప్రభుత్వం భూమి ఉన్న చెరువులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపారు. రైతులకు మూడు నెలల నుంచి గడువు ఇస్తూనే ఉన్నామన్నారు. అలాగే గండి కొట్టిన చెరువుల పరిధిలో చుట్టుపక్కల 780 మీటర్ల వరకు ఎటువంటి వరిపొలాలు లేవని, కొంతమంది కాల్వకు అడ్డుకట్ట వేయడం వల్ల నీరు ముందుకు వెళ్లే మార్గం లేక వెనక్కి ఎగదన్నిందని, మోటార్లు వేసి చేలో నీరు తోడించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నీటమునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నీట మునిగిన పంట చేల రైతులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తానని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు హామీ ఇచ్చారు. నిడమర్రు శివారు ప్రాంతంలో చేపల చెరువులకు గండ్లు కొట్టడం వల్ల నీరు వరిచేలలోకి చేరడంతో బాధిత వరి రైతులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్‌లు ముగ్గళ్ళ యాకోబు, ఉమామహేశ్వరరావు, హరిబాబు పాల్గొన్నారు.

కాగా కొల్లేరు ఫారెస్టు అధికారుల తీరుపై గతంలో ‘లంచం ఇస్తేనే సాగు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేకం కఽథనం వచ్చింది. దీనిపై విచారణ అనంతరం స్థానిక అటవీశాఖ అధికారిని సస్పెండ్‌ చేసి విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలోనే రైతులపై కక్ష సాధింపు ధోరణితో కొల్లేరు ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తూ చెరువుల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Updated Date - Apr 28 , 2025 | 12:37 AM