నాకు పేద, ధనిక తేడా లేదు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:53 AM
‘వీలైతే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అడ్డుపడవద్దని, తనకు పేద, ధనిక తేడా లేదు’ అని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
కాళ్ల, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ‘వీలైతే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అడ్డుపడవద్దని, తనకు పేద, ధనిక తేడా లేదు’ అని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామ్రేడ్స్.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కాలువ గట్లపై ఆక్రమణలను తొలగిస్తుంటే అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని, పంట, మురుగు కాలువలపై ఆక్రమించిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు. అన్నివర్గాల వారి ఆక్రమణలు తొలగించామన్నారు. తాగునీరు కలుషితం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని కాలువ గట్లపై ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టామన్నారు. ఇటువంటి వాటికి కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని ఆ మేరకే తొలగింపులు చేస్తున్నామన్నారు. ఆకివీడు, కాళ్ళ, ఉండి, పాలకోడేరు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ఆక్రమణలు తొలగించామన్నారు. ఇటీవల పాలకోడేరు రాశి కాలువ గట్టుపై ఆక్రమణల ఇళ్లను కోర్టు తీర్పు ప్రకారం తొలగించారని, తాను ఏ పనిచేసినా కోర్టు ఆదేశాల మేరకే చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను భేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ 30 రోజుల సమయం ఇస్తున్నానని వార్నింగ్ ఇవ్వడంతో కౌంటర్ ఇచ్చానన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఈవిధంగా మాట్లాడడం సబబా అని ప్రశ్నించారు. అతను ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదన్నారు. వివాదానికి ఆద్యుడైన అతనే క్షమాపణ చెప్పాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో తనకు పరిచయం ఉందన్నారు. మరో పదిహేను రోజుల్లో కోర్టు ఆర్డర్‌తో మిగిలిన ఆక్రమణలు తొలగిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు సంపూర్ణ ఆమోదంతో ఆక్రమణల ఇళ్లను తొలగిస్తున్నామని, తనకు, ప్రజలకు మంచి సంబంధం ఉందన్నారు. కామ్రేడ్స్.. ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే తన దృష్టికి తీసుకురండి. తొలగించకపోతే ఆరోపణలు చెయ్యండి అని కోరారు.