ఇల్లా.. స్థలమా !
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:21 AM
అన్ని వర్గాలకు చేరువకావడం కూటమి లక్ష్యాల్లో ఒక భాగం. ఈనెల శ్రావణమాసం సందర్భంగా గృహ ప్రవేశాలకు పక్కా ఇళ్లల్లో అవకాశం కల్పి స్తారా.. లేక ముందస్తుగా కసరత్తు చేస్తున్నట్టుగా కొత్తగా కోరుకున్న వారికి పట్టాలు ఇస్తారా అనేదే టెన్షన్.

శ్రావణం వచ్చింది పెద్దల మాటేంటి..
ఇస్తామన్న ఇళ్లు..జాగాలు ఈసారైనా దక్కేనా
30 వేల ఇళ్లల్లో ప్రవేశాలకు లబ్ధిదారుల ఆతృత
ఆరు వేల మందికిపైగా కొత్త జాగాలకు దరఖాస్తులు
ఈనెలలో అనుకున్నది జరిగితే పేదల పంట పండినట్టే
అన్ని వర్గాలకు చేరువకావడం కూటమి లక్ష్యాల్లో ఒక భాగం. ఈనెల శ్రావణమాసం సందర్భంగా గృహ ప్రవేశాలకు పక్కా ఇళ్లల్లో అవకాశం కల్పి స్తారా.. లేక ముందస్తుగా కసరత్తు చేస్తున్నట్టుగా కొత్తగా కోరుకున్న వారికి పట్టాలు ఇస్తారా అనేదే టెన్షన్. తెలుగుదేశం ప్రభుత్వం తన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. చాన్నా ళ్లుగా పూర్తయిన పక్కా గృహాలు తమ సొంతం కావాలని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తు న్నారు. ఇంకోవైపు కొత్తగా ఇళ్ల పట్టాలు అర్హులైన వారికి అందించేందుకు దరఖాస్తులు కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆరు వేలకుపైగా అందాయి. వీటి పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి పక్కా ఇళ్లల్లో ప్రవేశాలకు అవకాశం ఉందా.. కొత్తగా ఇంటి జాగాల జాబితాలో తమ పేరు చేరు తుందా, లేదా అనేదే ఉత్కంఠ.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిపైనే దాటింది. ఇప్పటికే సూపర్–6 పేరిట ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలులోకి తెస్తున్నారు. చాన్నాళ్ల క్రితం నిర్మించి వదిలేసిన పక్కా గృహాలను పేదల పరం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లల్లో లక్షకు పైగా గృహాలు మంజూరుకాగా వాటిలో కేవలం ఇప్పటివరకు 35 వేలకుపైగా ఇళ్లు నివాసయోగ్యంగా నిర్మాణం పూర్త య్యింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలుత టిడ్కో ఇళ్లపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో 11 వేలకు పైగా టిడ్కో ఇళ్లు మంజూరుకాగా వీటిలో కొన్ని మాత్రమే నూజివీడు, జంగారెడ్డిగూడెం, ఏలూరులలో పూర్తయినా ఇప్పటికీ దిక్కుమొక్కులేదు. జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను జంతువుల ఆవాసంగా మార్చింది. ముళ్ళపొదలతో నిండి విష పురుగులమయ మైన ఈ కాలనీల వైపు కన్నెత్తి చూసేవారు లేరు. ఇలాంటి క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంతకుముందు అర్హులుగా గుర్తించిన వారికే టిడ్కో ఇళ్లు కేటాయింపు జరుగు తుందని స్పష్టం చేస్తూ వచ్చారు. ఇంకోవైపు ఎన్టీఆర్ కాలనీ (జగనన్న కాలనీ)ల్లో పూర్తయ్యి ఇప్పటికీ లబ్దిదారులకు అందించని ఇళ్ల సంఖ్య వేలల్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగేయాల్సింది పోయి సాధ్యమై నంత మేర శ్రావణమాసంలో ఈ తరహా పక్కా ఇళ్లల్లో గృహ ప్రవేశాలకు అనువైన పరిస్థి తులు ఉంటే నిర్దేశిత నిర్ణ యం తీసుకుంటామని
పదేపదే ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. శ్రావ ణ మాసం రానేవచ్చింది. కొత్త ఇంట్లోకి వెళ్లేది ఎప్పు డంటూ పేద వర్గాలు ఆరాటపడుతున్నారు. ఈసారి గనుక ముహూర్తం తప్పితే మరో అవకాశం తమకు రాదేమోనన్న బెంగ, భయం వారిలో కనిపిస్తున్నాయి. మొత్తం పూర్తయ్యి ఖాళీగా ఉంటున్న ఇళ్లల్లో కొన్నిచోట్ల ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు అడ్డదారులను వినియో గించుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈ కాలనీల పరిసరాలు ఆలవాలమయ్యాయి.
ఇళ్ల స్థలాల సంగతేంటి
పక్కా గృహాల నిర్మాణం సాగుతుండగానే ఇంకోవైపు అర్హులైన పేద వర్గాల నుంచి మూడు సెంట్లు చొప్పున ఇంటి జాగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేర కు ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించారు. గత నెలా ఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 6, 514 దరఖాస్తులు అం దాయి. ఏలూరు డివిజన్ నుంచి 3,020, జంగా రెడ్డి గూడెం డివిజన్ నుంచి 552, నూజివీడు డివిజన్ నుంచి 2,936 దరఖాస్తులు అందగా వీటి పరిశీలన దాదాపు పూర్తి కావొచ్చింది. ఈనెల 15వ తేదీ నాటికి పట్టాలు పంపిణీకి సిద్ధం కావాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి పరోక్ష సంకేతాలు పంపారు. ఆమేరకు ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన ఇంటి జాగాల దరఖా స్తులపై సమీక్ష సాగింది. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఇప్పటికే అర్హులైన వారంతా పూర్వ జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం లభించి ఆ మేరకు నిర్మాణంకు సన్నద్ధం కాలేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కొంత కాలం పాటు ఆనోట ఈనోట ప్రచారం సాగింది. కాని దీనిపై యంత్రాంగం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసు కున్న వారంతా తమకు ఎక్కడా ఇంటి జాగా రాలేదని, పార్టీ పక్షపాతంగా తమను పక్కన పెట్టారని కొందరు, సమాచారం లేకపోవడంతో సరైన సమయంలో తాము దరఖాస్తు చేసుకోలేదని ఇంకొందరు పేర్కొంటూ తాజాగా దరఖాస్తులకు సిద్ధమయ్యారు. వీటి పరిశీలన, అందచేత ఎప్పుడు అనేదే ఇప్పటికీ లబ్ధిదారుల్లో ఉత్కంఠగా మారింది. దీనికి ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తేనే తప్ప లబ్దిదారుల్లో ఉన్న మీమాంస తీరడానికి మార్గమేలేదు.