డ్రెయిన్లకు మహర్దశ
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:30 AM
వర్షాకాలంలో ముంపు నివారణ లేకుండా ముందస్తుగా డ్రెయిన్ల ప్రక్షాళనతో సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రెయిన్ల మరమ్మతులు నిర్వహించకపోవడంతో గతేడాది వచ్చిన వరదల్లో అనేక గ్రామాలు, రోడ్లు, చేపల చెరువులు ముంపు బారిన పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం డ్రెయిన్ల ప్రక్షాళనకు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక పోయినా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఎక్కడికక్కడే డ్రెయిన్లను ప్రక్షాళన చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని 20 కిలోమీటర్ల పొడవున ఉన్న పుల్లవా డ్రెయిన్, 26 కిలోమీటర్ల పొడవున ఉన్న పెదకొమ్మిలేరు డ్రెయిన్ అభివృద్ధి పనులను చేపట్టారు.

కైకలూరు నియోజకవర్గంలో వేసవిలోనే ప్రక్షాళన పనులు
వర్షాకాలం ముంపునకు చెక్ పెట్టేలా ముందస్తు చర్యలు
ప్రభుత్వ నిధులు చాలక పోయినా నాయకుల చొరవతో ప్రక్షాళన పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు
కైకలూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ముంపు నివారణ లేకుండా ముందస్తుగా డ్రెయిన్ల ప్రక్షాళనతో సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రెయిన్ల మరమ్మతులు నిర్వహించకపోవడంతో గతేడాది వచ్చిన వరదల్లో అనేక గ్రామాలు, రోడ్లు, చేపల చెరువులు ముంపు బారిన పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం డ్రెయిన్ల ప్రక్షాళనకు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక పోయినా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఎక్కడికక్కడే డ్రెయిన్లను ప్రక్షాళన చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని 20 కిలోమీటర్ల పొడవున ఉన్న పుల్లవా డ్రెయిన్, 26 కిలోమీటర్ల పొడవున ఉన్న పెదకొమ్మిలేరు డ్రెయిన్ అభివృద్ధి పనులను చేపట్టారు. వీటి ప్రక్షాళన కోసం రూ.40 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే కామినేని సొంత నిధులతో పంటు కొనుగోలు చేయడంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. కాలువ మధ్యలో పంటు పైన ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసి డ్రెయిన్లలో పేరుకుపోయిన కిక్కిస, తూడును పూర్తిస్థాయిలో తొలగించారు. పుల్లవా డ్రెయిన్‌లో దిగువ ఉప్పుటేరు నుంచి ఎగువకు 12 కిలోమీటర్ల పొడవునా కిక్కిస తొలగించడంతో ఉప్పుటేరులో పోటుకు నీరు ఎగువ కు పారుదల అవుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా నీరు ఎదురు రావడం చూడలేదని ఆయా ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు మండలంలోని రామవరం, దొడ్డిపట్ల, భుజబలపట్నం, వదర్లపాడు గ్రామాల్లోని చేపల, రొయ్యల చెరువులకు ఈ డ్రెయిన్ ద్వారా వచ్చే నీటిని వినియోగించుకుంటున్నారు. ఈ డ్రెయిన్ అభివృద్ధితో ఎగువున ఆచవరం, కైకలూరు, కలిదిండి ఆర్‌అండ్‌బీ రహదారి ఆటపాక, అగ్రహారం వెళ్లే రహదారి ఆయా గ్రామాల్లో పలు నివాస గృహాలు ముంపు బారిన పడకుండా ఉంటాయి.
ముదినేపల్లి మండలంలో పెదకొమ్మిలేరు డ్రెయిన్‌లో కిక్కిస, తూడు దట్టంగా పేరుకుపోవడంతో గత వర్షాకాలం వేలాది ఎకరాలు పంటపొలాలు నీటమునిగి రైతులకు అపార నష్టం చోటుచేసుకుంది. దీంతో చిన్నకామనపూడి, పెదకామన పూడి, చిగురు కోట గ్రామాల్లో డ్రెయిన్ ప్రక్షాళన పనులు చేపడుతున్నారు. ఇప్పటికే సుమారు 60 శాతం పనులు పూర్తిచేశారు. అయితే పుల్లవా డ్రెయిన్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.29 లక్షలే నిధులు మంజూరు చేయ గా ఒక కిలోమీట రుకు ప్రభుత్వ ధరల ప్రకారం రూ.60 వేలు ఖర్చు అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నిర్వహిస్తే కిలోమీటరుకు రూ.2.30 లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు 12 కిలోమీటర్ల దూరానికే సరిపోయాయి. మిగిలిన 10 కిలోమీటర్లకి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే కామినేని ఏర్పాటు చేసిన కమిటీ రైతులు భరించేందుకు ముందుకొచ్చారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, డీసీ చైర్మన్లు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో డ్రెయిన్ల ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో ముందస్తుగా డ్రెయిన్‌ల ప్రక్షాళన చేయడం గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదంటూ రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.