మేమూ అర్హులమే కదా!
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:00 AM
గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన రామయ్యమ్మకు 75 ఏళ్లు. భర్త గుల్లుపల్లి సత్యం వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ 2023 అగస్టు 8 తేదీన మృతి చెందారు.

విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి)
-గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన రామయ్యమ్మకు 75 ఏళ్లు. భర్త గుల్లుపల్లి సత్యం వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ 2023 అగస్టు 8 తేదీన మృతి చెందారు. ఆమె వితంతు పింఛన్ కోసం 2023 నవంబరు 16న స్థానిక గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామయ్యమ్మకు ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. దీంతో కలెక్టరేట్ ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు వచ్చారు.
-వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన రావాడ ఎర్రయ్యమ్మ భర్త చినదేముడు 2023 ఏప్రిల్ 19న మృతి చెందారు. ఆమె వితంతు పింఛన్ కోసం స్థానిక గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదు. దీంతో ఈమె కూడా కలెక్టరేట్‌కు వచ్చారు.
ఫ విజయనగరానికి చెందిన బారీపల్లి అప్పలరాములు భర్త సత్యం దేముడు 2023 మే 2 తేదీన ఆనార్యోగంతో మృతి చెందారు. దీంతో ఆమె జీవనానికి ఇబ్బంది కలగడంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ మంజూరు కాకపోవడంతో కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు.
-బాడంగి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఆవులు నారాయణమ్మ భర్త సంగమేషి 2023 జూన్ 2న ఆనారోగ్యంతో మరణించారు. దీంతో నారాయమ్మ వితంతు పింఛన్ కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా ఈమెకు కూడా మంజూరు కాలేదు. ఈ పరిస్ధితిలో ఆమె కలెక్టరేట్‌లో పించన్ మంజూరు చేయాలని కోరారు.
-డెంకాడ మండలం గుణుపూరు గ్రామానికి చెందిన సిరిగుడు మంగమ్మ భర్త పైడితల్లి 2023 ఏప్రిల్ 27న మృతి చెందారు. ఆమె జీవనాధారానికి ఇబ్బంది కలగడంతో సచివాలయంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు భర్త చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తున్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇలాంటి వారి సమస్యలు అధికంగా వచ్చాయి. ప్రభుత్వం స్పౌజ్ కోటా పింఛన్ మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే 2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు భర్తలు చనిపోయిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2023 డిసెంబరు నెలకు ముందు భర్తలు చనిపోయిన వారి గురించి సృష్టత ఇవ్వకపోవడంతో అలాంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు కూడా పింఛన్ మంజూరు చేయాలని కలెక్టరు బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్‌వో శ్రీనివాసమూర్తికి వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 188 వినతులు రాగా వీటిలో డీఆర్‌డీఏ పింఛన్ల మంజూరుకు 30వినతులు, రెవెన్యూకు 80, పీఆర్‌కు 15 వినతులు వచ్చాయి. వెంటనే వీటిని పరిష్కరించాలని ఆయాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.