Share News

Compensation పరిహారం కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:53 PM

Waiting for Compensation వంశధార వరద కాలువ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారో గాని రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కోసం భూములిచ్చిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఐదేళ్లు గడిచినా వారికి నష్టపరిహారం అందలేదు.

 Compensation  పరిహారం కోసం ఎదురుచూపు
సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాంతం

ఐదేళ్లు గడిచినా దక్కని నష్టపరిహారం

స్పందించని గత వైసీపీ ప్రభుత్వం

ఏటా బ్యాక్‌ వాటర్‌తో ముప్పు

రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

భామిని, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): వంశధార వరద కాలువ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారో గాని రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కోసం భూములిచ్చిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఐదేళ్లు గడిచినా వారికి నష్టపరిహారం అందలేదు. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌తో ఏటా రైతులు తమ పంటలను నష్టపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా 2006లో సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కోసం 163 ఎకరాలను సేకరించి.. దీనికి తూర్పు వైపు గట్టు నిర్మించారు. కాట్రగడ నుంచి వరద కాలువ ద్వారా ప్రవహించిన వంశధార వరదనీరు బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌లో కొంతమేర నిలుపుదల చేయాలని భావించారు. ఈ మేరకు దాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ లోగా ఒడిశా రాష్ట్ర అభ్యంతరాలతో ఆ పనులు నిలిచిపోయాయి. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హిరమండలం రిజర్వాయర్‌కు వరదనీరు మళ్లించారు. దీంతో సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి బ్యాక్‌ వాటర్‌ పోటెత్తింది. ఎగువన ఉన్న రైతులకు చెందిన వరి, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో అధికారులు వాటిని పరిశీలించి సర్వే నిర్వహించారు. ఈ మేరకు రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌తో నిండిపోతున్న 44 ఎకరాలను అదనంగా సేకరించారు. పరిహారం కింద రూ.6 కోట్లు చెల్లిస్తామని అప్పట్లో వారు మాట ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్‌ మారింది. 2020లో విచారణ అయినప్పటికీ ఇప్పటివరకు నష్ట పరిహారం మాత్రం రైతులకు అందలేదు. అధికారులు సేకరించిన 44 ఎకరాలు ఆక్రమణకు గురవుతాయనే భయంతో కొందరు సుమారు 40 ఎకరాల్లో ఏటా వరి, పత్తి సాగు చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌తో ఆయా పంటలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీనిపై గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా పునర్విభజనలో పార్వతీపురం మన్యంలో భామిని చేరింది. వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ పరిహారం కోసం పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లు, వంశధార అధికారుల చుట్టూ తిరిగి వారు విసిగెత్తిపోయారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు.

కుటుంబ పోషణ భారం

గతంలో హిరమండలం రిజర్వాయర్‌ భూ సేకరణలో నాలుగు ఎకరాలను కోల్పోయా. అరకొరగా చెల్లించిన పరిహారంతో బురుజోల గ్రామంలో 3.30 ఎకరాల పల్లం భూమిని కొనుగోలు చేశా. వ్యవసాయం చేసుకోవాలని ఆశ పడ్డా. అయితే ఆ భూమి కూడా సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో కలిసిపోవడం బతుకు భారంగా మారింది. చేతిలో చిల్లిగవ్వలేదు. నష్టపరిహారం అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది.

- మడపన్న తులసి, బురుజోల

=================================

ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి

సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల తొమ్మిది ఎకరాలను కోల్పోయాం. పైసా ఆదాయం లేకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నాలుగేళ్ల కిందట మా భూమిని తీసుకుంటామని ప్రభుత్వం గెజిట్‌ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నష్టపరిహారం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అర్థం కావడం లేదు.

- బి.శాంత్రో, రైతు

=================================

జమ చేస్తాం..

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వానికి నివేదించాం. తాజాగా కూటమి సర్కార్‌ దృష్టికి తీసుకెళ్లాం. సుమారు రూ. ఏడు కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏయే రైతుకు ఎంతెంత పరిహారం అందిస్తామనేది ఇప్పటికే తెలియజేశాం. ప్రభుత్వం ఈ పరిహారాన్ని విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలో జమ చేస్తాం.

- లీనా, యూనిట్‌-4 స్పెషల్‌ డీటీ

Updated Date - Apr 28 , 2025 | 11:53 PM