Easily Accessible! అందుబాటులో ఉండేలా!
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:11 AM
To Be Made Easily Accessible! జిల్లాలో ఓటర్లు వారికి సమీపంలో సౌకర్యవంతంగా.. ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు
సాలూరు,ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్లు వారికి సమీపంలో సౌకర్యవంతంగా.. ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 1200 మంది ఓటర్లకు ఒక కేంద్రం అదీ దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో 1200 మందిపైబడి ఓటర్లు ఉంటే సమీప కేంద్రాల్లోకి చేర్చడం, లేదా కొత్తగా మరో కేంద్రం ఏర్పాటు చేయడం, ప్రస్తుత కేంద్రం ఇబ్బందికరంగా ఉంటే తొలగించి మరోచోట ఏర్పాటు చేసే సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. అందుకుగానూ నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు తీసుకొని వాటిపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు తీసుకుంటున్నారు. ఓటర్లకు కూడా పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పులపై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం 1200 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఉండడంతో ఓటు హక్కు వినియోగానికి ప్రజలు ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోంది. చాలా దూరం నుంచి పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 46 కేంద్రాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మన్యంలో 1032 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పాలకొండ నియోజకవర్గంలో 287 కేంద్రాలు ఉండగా 1200 ఓటర్లలోపు ఉన్న కేంద్రాలు 267, అంతకుమించి ఓటర్లు ఉన్న కేంద్రాలు 20 వరకూ ఉన్నాయి. పార్వతీపురంలో 233 కేంద్రాలు ఉండగా 1200 ఓటర్ల లోపు 223 , అంతకుమించి ఓటర్లు ఉన్న కేంద్రాలు 10 వరకూ ఉన్నాయి. కురుపాంలో మొత్తం 269 కేంద్రాలు ఉండగా 1200 ఓటర్ల లోపు 266 కేంద్రాలు ఉండగా అత్యధిక ఓటర్లు ఉన్న కేంద్రాలు 3 వరకూ ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1200 ఓటర్ల లోపు 230, ఆపై ఓటర్లు ఉన్న కేంద్రాలు 13 వరకూ ఉన్నాయి. ‘ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు 1200 ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాల సేకరిస్తున్నాం. త్వరలో నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.’ అని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తెలిపారు.