There are schools... but no children! పాఠశాలలున్నాయ్.. పిల్లల్లేరు!
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:33 AM
There are schools... but no children! పాఠశాలకు పక్కా భవనం, తరగతి గదులు, విశాలమైన మైదానం, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం ఉండగా విద్యార్థులు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ముగ్గురు ఉన్నారు. ఇలా ఒకటి రెండు పాఠశాలలు కాదు. కొత్తవలస మండలంలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపే.

పాఠశాలలున్నాయ్.. పిల్లల్లేరు!
ఇద్దరితోనే నాలుగు స్కూళ్లు
ఇంకొన్నిచోట్ల పదిలోపే సంఖ్య
కొత్తవలస, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు పక్కా భవనం, తరగతి గదులు, విశాలమైన మైదానం, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం ఉండగా విద్యార్థులు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ముగ్గురు ఉన్నారు. ఇలా ఒకటి రెండు పాఠశాలలు కాదు. కొత్తవలస మండలంలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపే. ఆ వివరాల్లోకి వెళితే..
వియ్యంపేట గ్రామంలో ఒకటి నుంచి 5 తరగతులకు సంబంధించి రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఒకప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు ఉండగా వారు కూడా ఒకటి, రెండు తరగతులు చదువుతున్నారు. వీరిద్దరి కోసం ఒక ఉపాధ్యాయుడు, మరుగుదొడ్డిని శుభ్రపర్చేందుకు ఒక ఆయా, మధ్యాహ్న భోజనం వండేందుకు ఒక నిర్వాహకురాలు ఉన్నారు. ఇదే గ్రామంలో నున్న మరో పాఠశాలలో 1నుంచి 5 తరగతులకు సంబంధించి 6 గురు విద్యార్థులు ఉండగా వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ రెండు పాఠశాలలకు మధ్య దూరం చూస్తే కేవలం 200 మీటర్లే. కాగా వియ్యంపేట పంచాయతీ శివారు కొట్టానవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో కూడా ఇద్దరే విద్యార్థులు ఉండగా వీరికొక ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు ఉన్నారు.
- కంటకాపల్లిలో ఒకే కాంపౌండ్ రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతులకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఉండగా వీరికి ఒక ఉపాధ్యాయుడు, ఆయా, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. ఇక రెండో పాఠశాలలో 9 మంది విద్యార్థులు ఉండగా వీరికి ఇద్దరు ఉపాధ్యాయులున్నారు.
- అర్దానపాలెం, యర్రవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరేసి విద్యార్థులు ఉన్నారు. ఇవే కాదు మండలంలో మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ ముగ్గురేసి విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.
- మరో 17 పాఠశాలలో 10 నుంచి 20 లోపు మంది మాత్రమే విద్యార్థులున్నారు.
వైసీపీ నిర్వాకంతోనే..
వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే తక్కువ విద్యార్థులతో పాఠశాలలు నడుస్తున్నాయి. అప్పట్లో 1నుంచి 5 తరగతుల పాఠశాలలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పర్‌ప్రైమరీ పాఠశాలలోగాని, హైస్కూల్‌లో విలీనం చేస్తూ జీఓ నెంబరు 117ను విడుదల చేసింది. కొన్ని గ్రామాల్లో పాఠశాలలను విలీనం చేయగా వైసీపీ నాయకులు తమ గ్రామాల్లో ఉన్న పాఠశాలలను వేరే వాటిల్లో విలీనం చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో కొన్ని పాఠశాలలు అలానే ఉండిపోయాయి. వియ్యంపేట గ్రామంలో జడ్పీ హైస్కూల్‌లో 1నుంచి 10 వరకు ఉండగా పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను విలీనం చేయడానికి నాయకులు నిరాకరించడంతో ప్రాథమిక పాఠశాల అలానే ఉంది. కంటకాపల్లి గ్రామంలోనూ అంతే.
విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలలు
అర్దానపాలెం, కొట్టానవానిపాలెం, వియ్యంపేట, ఎర్రవానిపాలెం గ్రామాలలో ఇద్దరేసి విద్యార్థులు ఉండగా కంటకాపల్లి రైల్వేస్టేషన్, కాటకాపల్లి గ్రామాల పాఠశాలల్లో ముగ్గురేసి ఉన్నారు.సంతపాలె(5), తుమ్మికాపల్లి గేట్(5)అడ్డూరువానిపాలెం(8),అప్పన్నపాలెం(7)అర్దాన పాలెం కాలనీ(7) గనిశెట్టిపాలెం(7) మశివానిపాలెం (7),రాయపురాజుపేట(6),రెల్లి పాఠశాలలో 7గురు విద్యార్థులు ఉన్నారు.
ఇక్కడేమో ఉపాధ్యాయులు లేరు
వీరభద్రపురం ప్రాథమిక పాఠశాలలో ఒకటినుంచి 5వ తరగతి వరకు 52 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మంది లోపు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 21 నుంచి 60 మంది వరకు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఒకే దగ్గర ఉన్న రెండు పాఠశాలలను విలీనం చేయొచ్చు కదా అంటే అందుకు విద్యాశాఖ నుంచి ఆదేశాలు రావాలంటున్నారు. ఇదే పరిస్థితి చాలా మండలాల్లో ఉంది.