Share News

సోలార్‌పై ఆసక్తి అంతంతే!

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:54 PM

The interest in solar is over! సూర్యఘర్‌ యోజన పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ లేదు. కొంతకాలంగా సాగుతున్న రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ తీరే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకూ 8,026 రిజిస్ర్టేషన్లు జరగ్గా.. 1004 మంది ఏర్పాటుకు ముందుకొచ్చారు.

సోలార్‌పై ఆసక్తి అంతంతే!

సోలార్‌పై ఆసక్తి అంతంతే!

ఏడాదిలో 744 యూనిట్లే ఏర్పాటు

సూర్యఘర్‌ యోజనపై ఆసక్తి చూపని వినియోగదారులు

జిల్లాలో నత్తనడకనపథకం అమలు

రాయితీ ఇస్తున్నా కానరాని స్పందన

సూర్యఘర్‌ యోజన పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ లేదు. కొంతకాలంగా సాగుతున్న రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ తీరే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకూ 8,026 రిజిస్ర్టేషన్లు జరగ్గా.. 1004 మంది ఏర్పాటుకు ముందుకొచ్చారు. 744 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, మహిళా సంఘ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చినా ఫలితం అంతంతే. డాబా ఇళ్లు లేకపోయినా.. ఖాళీ స్థలాల్లోనూ సోలార్‌ ఫలకలు ఏర్పాటు చేసుకోండని కోరుతున్నా ముందుకు రావడం లేదు.

రాజాం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సూర్యఘర్‌ యోజన పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రజలకు విద్యుత్‌ చార్జీల భారం తగ్గించడంతో పాటు విద్యుత్‌ తయరీలో వాడే బొగ్గు వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని అదుపు చేయవచ్చునని సోలార్‌ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాయి. గత ఎన్టీయే ప్రభుత్వమే పీఎం సుర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి రాయితీలు ప్రకటిస్తూ వస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాధాన్యతను గుర్తించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాయితీని ఉపయోగించుకుని విద్యుత్‌ చార్జీల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చునని ప్రచారం చేస్తోంది. అయినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సూర్యఘర్‌ పథకంలో మూడు కిలోవాట్ల యూనిట్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల వరకూ రాయితీ అందించనుంది. ఇంటి అవసరాలకుపోను విద్యుత్‌ మిగిలి ఉంటే విక్రయించవచ్చు. డిస్కంలే కొనుగోలు చేసి ఆ నగదును లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తాయి. అయితే మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.

మిగులు విద్యుత్‌ కొనుగోలు..

ఎవరైనా సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేసుకొని.. వారు వాడిన విద్యుత్‌ కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగితే అది వారికే లాభం. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేస్తుంది. డిస్కంలే ఆ మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఒకసారి సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. కిలో వాట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే దాదాపు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇందులో రూ.30 వేల వరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రెండు కిలోవాట్ల ప్లాంట్‌ అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల ఖర్చు అవుతుంది. రూ.60 వేల వరకూ సబ్సిడీ ఇస్తుంది మూడు కిలోవాట్ల యూనిట్‌ అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20 లక్షల ఖర్చు అవుతుంది. రూ.90 వేల వరకూ రాయితీ పొందవచ్చు. ఇంటి అవసరాలకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే.. చాలా వరకూ మిగలనుంది. దానిని డిస్కంలకు అమ్మి కొంత ప్రయోజనం కూడా పొందవచ్చు.

బహుళ ప్రయోజనం..

సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుతో లబ్ధిదారుడితో పాటు ప్రభుత్వానికి ప్రయోజనమే. అయితే ప్రభుత్వానికి ఖర్చు పెరిగినా.. దీర్ఘకాలంలో విద్యుత్‌ పంపిణీ, కొనుగోలులో భారం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200లోపు యూనిట్లకు ఉచితంగానే విద్యుత్‌ అందిస్తున్నారు. సాధారణంగా ఒక్కో యూనిట్‌కు రూ.6 ఖర్చు అవుతుంది. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే చాలా వరకూ ప్రభుత్వానికి ఆదా అయినట్టే. ఎక్కువ మంది ఎస్సీ లబ్ధిదారులు 150 యూనిట్లకు మించి వాడడం లేదు. వారు గనుక కిలోవాట్‌ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లను అందిస్తుంది. అప్పడు ప్రభుత్వంపై కేవలం 20 నుంచి 30 యూనిట్ల భారమే పడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 50,685 మంది ఉన్నారు. అటు పార్వతీపురం మన్యం జిల్లాలో 73,328 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకూ ఒక శాతం మంది కూడా వినియోగించుకోలేదు. ఏడాదిగా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపడుతున్నా.. సూర్యఘర్‌ కింద సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు.

అవగాహన కల్పిస్తున్నాం

సూర్యఘర్‌ పథకంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నా వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. జిల్లాలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి సర్వే జరుగుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల విషయంలో వివరాలు సేకరిస్తున్నాం. ఎవరైనా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొస్తే సూర్యఘర్‌ పథకం కిందే మంజూరవుతుంది. దీనికి రాయితీ అందిస్తారు. మిగులు విద్యుత్‌ను సైతం డిస్కంలు కొనుగోలు చేస్తుంది. ఇది మేలైన పథకం. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.

- లక్ష్మణరావు, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ, విజయనగరం

Updated Date - Apr 28 , 2025 | 11:54 PM