భగ్గుమంటున్న బంగారం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:58 PM
బంగారం ధర భగ్గుమంటున్న తరుణంలో అక్షయ తృతీయ నాడు పుత్తడి కొనుగోలుపై పలువురు తర్జనభర్జన పడుతున్నారు.

సాలూరు రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): బంగారం ధర భగ్గుమంటున్న తరుణంలో అక్షయ తృతీయ నాడు పుత్తడి కొనుగోలుపై పలువురు తర్జనభర్జన పడుతున్నారు. వైశాఖ శుద్ధ తృతీయ సందర్భంగా ఈ నెల 30న అక్షయ తృతీయ పండగను జరుపుకోనున్నారు. ఆ రోజున ఇష్టదైవాలకు పూజలు చేస్తారు. అనంతరం ఎంతోకొంత పసిడిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం బంగారం ధర చుక్కలను తాకింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 98,280 ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 89,500 ఉంది. తులం బంగా రం ధర రూ.లక్ష దాటడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. గతేడాది అక్షయ తృతీయకు పార్వతీపురం మన్యం జిల్లాలో రూ. 3 కోట్లకు పైబడి పుత్తడి వ్యాపారం సాగింది. ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారం ధర అధికంగా ఉన్న నేపథ్యంలో అమ్మకాలు ఎలా ఉంటాయోనని వ్యాపారులు సందిగ్ధంలో ఉన్నారు. బంగారం ఈ ఏడాదిలో (2025)లోనే అధికంగా ధర పెరగడం విశేషం. గతేడాది అక్టో బరు నుంచి ఇప్పటికి రూ.17,800లు పెరిగింది. గతేడాది అక్టోబరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 80,500 ఉండగా ప్రస్తుతం దానిధర రూ. 98,280 ఉంది. మరోవైపు పెళ్లిబాజాలు మోగుతున్నా పసిడి వ్యాపారం డీలాగా ఉన్నట్టు వ్యాపారులంటున్నారు. ఒక పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపు 37.5 శాతం బంగారం ఆభరణాలకు వెచ్చిస్తారు. ప్రస్తుతం చాలామంది అత్యవసరమైన శతమానం తది తర వస్తువుల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తూ ఆభరణాల విక్రయాలను పరిమితం చేస్తున్నా రు. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడితే బంగారం ధర తగ్గే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. గత నెల 21 నాటికి పది గ్రామాలు 24 క్యారెట్ల బంగారం రూ. 1,00,015 ఉండగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రూ.98,280కు తగ్గింది. ఇంకా తగ్గవచ్చన్న ఉద్దేశంతో కొనుగోలు వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ఉన్నవారు సైతం ఈ ఏడాది పరిమితంగానే కొనుగోలు చేసే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కన్నా 45 శాతం వరకు అమ్మకాలు తగ్గే అవకాశముందని సాలూరు బంగారం వర్తకుల సంఘం ప్రతినిధి సుతాపల్లి వీరవెంకటరావు తెలిపారు.
ఇవి కొనుగోలు చేస్తే మేలు..
అక్షయ తృతీయ సందర్భంగా బంగారమే కొనుగోలు చేయాలని లేదు. పుత్తడి కొనుగోలు చేసే స్థోమత లేకపోతే పసుపు, గళ్ల ఉప్పు, బెల్లం కొనుగోలు చేసినా మంచిందే. అక్షయ తృతీయ పూజను ఉదయం 6.46 గంటల నుం చి 8.45 గంటల మధ్య చేసుకుంటే శుభకరం.
-ఆర్.పార్థసారథి, రుత్వికుడు