Palakonda కూటమిదే పాలకొండ
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:50 PM
The alliance itself of Palakonda పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నికలో కూటమి పై చేయి సాధించింది. కోరం లేక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరగడంతో ఉత్కంఠకు తెరపడింది. చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికయ్యారు.

చైర్‌పర్సన్‌గా మల్లీశ్వరి ఎన్నిక
వీడిన ఉత్కంఠ
పాలకొండ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నికలో కూటమి పై చేయి సాధించింది. కోరం లేక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరగడంతో ఉత్కంఠకు తెరపడింది. చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికయ్యారు. పట్టణంలో 19వ వార్డుకు చెందిన రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. చైర్‌పర్సన్ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో రెండో వార్డుకు చెందిన ఆకుల మల్లీశ్వరికి ఆ పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో సీన్ మారింది. మరోవైపు సంఖ్యా బలం ఉన్న వైసీపీ కౌన్సిలర్లు రెండుసార్లు సమావేశానికి హాజరుకాక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. చివరకు సోమవారం మరోసారి ఎన్నిక జరగగా చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఎమ్మెల్యేతో పాటు మల్లీశ్వరి, టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, జనసేనలో చేరిన కౌన్సిలర్ గంగునాయుడు నగర పంచాయతీకి చేరుకున్నారు. ఆకుల మల్లీశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ శోభికకు తెలియజేశారు. టీడీపీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ అడపా జయ దానిని ప్రతిపాదించారు. 20వ వార్డు కౌన్సిలర్ గంట వరలక్ష్మి ఆమోదించారు. దీంతో చైర్‌పర్సన్‌గా మల్లీశ్వరిని ఎన్నికల అధికారి ప్రకటించారు.
వైసీపీ తరపున బీఫారం
వైసీపీ పట్టణ అధ్యక్షుడు మన్మఽథరావు, సీనియర్ నాయకులు ధవళేశ్వరరావు మల్లీశ్వరికి పార్టీ తరపున బీఫారం కూడా ఎన్నికల అధికారికి అందించారు. విప్ కూడా జారీ చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని మల్లీశ్వరి చెప్పినప్పటికీ ఎలా ఆమోదించారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రాంబాబు, సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తి ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఎన్నిక ప్రక్రియలో నగర పంచాయతీ కమిషనర్ రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని కుట్రలు పన్నినా విజయం మాదే: మంత్రి సంధ్యారాణి...
వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ఖాతాలోనే పాలకొండ నగర పంచాయతీ చేరిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని చైర్‌పర్సన్ ఆకుల మల్లీశ్వరికి అభినందనలు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు చైర్‌పర్సన్ ఎన్నిక జరగకుండా వైసీపీ చేసిందన్నారు. అయితే కూటమి అభివృద్ధిని చేసి కౌన్సిలర్లు కూడా తమ వైపు వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా విజయం సాధించామని తెలిపారు. అంతకముందు అంతకముందు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ క్యాంప్ కార్యాలయంలో కూటమి నేతలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చలు జరిపారు. అరకు పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్ , సీనియర్ నేత పల్లా కొండలరావు తదితరులు పాల్గొన్నారు.