Share News

Teamwork... Increase admissions టీం వర్క్‌ చేసి.. ప్రవేశాలు పెంచి

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:35 AM

Teamwork... Increase admissions రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవేశాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇంటర్‌ రెండు సంవత్సరాలు కలిపి కేవలం 13 మంది విద్యార్థినులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 265కు పెరిగింది.

Teamwork... Increase admissions టీం వర్క్‌ చేసి.. ప్రవేశాలు పెంచి
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల భవనం

టీం వర్క్‌ చేసి.. ప్రవేశాలు పెంచి

రాజాం మహిళా జూనియర్‌ కాలేజీలో అనూహ్యంగా పెరిగిన విద్యార్థులు

గత ఏడాది 13.. ఈ ఏడాది 265

వేసవి సెలవుల్లో ప్రణాళికతో పనిచేసిన అధ్యాపకులు

గిరిజన హాస్టల్‌ అధికారితోనూ సమన్వయం

రాజాం, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి):

రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవేశాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇంటర్‌ రెండు సంవత్సరాలు కలిపి కేవలం 13 మంది విద్యార్థినులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 265కు పెరిగింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో అధ్యాపకులు విద్యాబోధన ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ కుమరాపు జనార్దనరావుతో పాటు అధ్యాప కులు సమన్వయంగా కృషిచేయడంతోనే అడ్మిషన్లు పెరిగాయి. వేసవి సెలవుల్లో విద్యార్థినుల తల్లిదండ్రులను కలవడం, వసతిగృహాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిలో చేరి కళాశాలలో బాగా చదువుకోవచ్చునని అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించడం మంచి ఫలితాలు ఇచ్చాయి.

రాజాంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ(జనరల్‌) ఉంది కానీ బాలికల కోసం ప్రత్యేక జూనియర్‌ కాలేజీ లేదు. అవసరమని భావించి నేటి ఎమ్మెలే, ఒక నాటి మంత్రి కోండ్రు మురళీమోహన్‌ బాలికల జూనియర్‌ కాలేజీని మంజూరు చేయించారు. అయితే అప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఉండడం, ఆపై ప్రైవేటు జూనియర్‌ కాలేజీల హవా నడుస్తుండడంతో అడ్మిషన్లు మందకొడిగా ఉండేవి. ఇంటర్‌ రెండు సంవత్సరాలు కలిపి 130 వరకూ చదివేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, మహిళా జూనియర్‌ కాలేజీని పట్టించుకోలేదు. దీంతో ప్రవేశాలు పడిపోయాయి.

ఫ ప్రిన్సిపాల్‌గా కుమరాపు జనార్దనరావు నియమితులయ్యాక ఆయనతో పాటు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు 13 మంది కలిసి వేసవి సెలవుల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ఇక్కడ చేర్పిస్తే ఉత్తమ విద్యాబోధనతో పాటు హాస్టల్‌ వసతి కల్పిస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున విద్యార్థినులు చేరారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం కూడా విద్యార్థినుల చేరికకు దోహదపడింది.

ఫ రాజాం పట్టణంలో బాలికలకు సంబంధించి ఎస్టీ వసతిగృహం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అనూరాధ వార్డెన్‌గా వచ్చాక ఆమె కూడా వివిధ ప్రాంతాల నుంచి 50 మంది విద్యార్థినులను రాజాం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో చేర్పించారు. హాస్టల్‌లో సైతం అడ్మిషన్లు ఇచ్చారు. రాజాం, పాలకొండ, బొబ్బిలి నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థినులు కాలేజీలో అడ్మిషన్లు తీసుకుని ఎస్టీ వసతిగృహంలో చేరారు. ప్రస్తుతం బాలికల వసతిగృహంలో 150 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆపై డేస్కాలర్స్‌ సైతం చేరడంతో బాలికల జూనియర్‌ కాలేజీ విద్యార్థినులతో కళకళలాడుతోంది.

ఫ వసతిగృహం పక్కనే కేజీబీవీ విద్యాలయం కోసం టైప్‌ 4 భవనాలు నిర్మించారు. రెండేళ్ల కిందట నిర్మాణం పూర్తయినా వినియోగించడం లేదు. జిల్లా స్థాయి అధికారులు దృష్టిపెట్టి ఆ భవనాలను ఎస్టీ వసతిగృహం వినియోగానికి అప్పగిస్తే ఇంకా విద్యార్థినులు పెరుగుతారు.

అధ్యాపకుల కృషితోనే..

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఈ ఏడాది విద్యార్థినుల ప్రవేశాలు పెరిగాయి. అధ్యాపకులు సమన్వయంగా కృషిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. కళాశాలకు అందుబాటులో గిరిజన వసతిగృహం ఉంది. అయితే అక్కడ భవనాలు చాలక ఇబ్బందులు పడుతున్నారు. కేజీబీవీ విద్యాలయం కోసం నిర్మించిన టైప్‌ 4 భవనాలను వారికి అప్పగిస్తే కళాశాలలో కూడా మరింతగా విద్యార్థినుల ప్రవేశాలు పెరుగుతాయి.

- కుమరాపు జనార్దనరావు, ప్రిన్సిపాల్‌, రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీ

--------------

Updated Date - Aug 03 , 2025 | 12:35 AM