Share News

Suspense! ఉత్కంఠ!

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:52 PM

Suspense! బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటమురళీకృష్ణారావుపై కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నోటీసుపై మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు నేతృత్వంలో కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Suspense! ఉత్కంఠ!
బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం

ఉత్కంఠ!

బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌పై నేడు అవిశ్వాస తీర్మానం

ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

వైసీపీ వేసిన రిట్‌ పిటిషన్‌పై ఇంకా వెలువడని కోర్టు నిర్ణయం

ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

బొబ్బిలి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటమురళీకృష్ణారావుపై కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నోటీసుపై మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్డీవో జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు నేతృత్వంలో కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రిసైడింగ్‌ అధికారి ఆర్డీవో రామ్మోహనరావు మున్సిపల్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశం హాలులో సీట్ల వరుస క్రమాన్ని సోమవారం పరిశీలించారు. ప్రిసైడింగ్‌ అధికారికి, 31 మంది కౌన్సిలర్లకు, ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే బేబీనాయనకు, కోఆప్షన్‌ సభ్యులకు, అధికారులకు అవసరమైన సీట్లను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, వైసీపీ సభ్యులకు వేర్వేరు వరుసలు ఏర్పాటు చేశారు. కమిషనర్‌ లాలం రామలక్ష్మి, ఇతర సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

అవిశ్వాస ప్రతిపాదనలు, నోటీసులు చెల్లవని, వీటిని కొట్టివేయాలని వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రిట్‌ పిటీషన్‌పై హైకోర్టు నుంచి ఇంకా నిర్ణయం వెలువడ లేదు. సోమవారం సాయంత్రం వరకు కోర్టులో ఇరు పక్షాల వాదోపవాదనలు జరిగాయి. తుది నిర్ణయాన్ని హైకోర్టు ప్రకటించాల్సి ఉంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైకోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

- కోర్టు నుంచి ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో వైసీపీలోని సమ్మతి, అసమ్మతి కౌన్సిలర్లు, అధికార పార్టీకి చెందిన టీడీపీ కౌన్సిలర్లలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్‌ సమావేశం సజావుగా సాగేందుకు అవసరమైన నిబంధలను తూచా తప్పకుండా పాటించాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

- మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి సంబంధించిన అంశంపై వైసీపీ నాయకులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు సంయమనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ఆచితూచి అడుగువేయాలని, కౌన్సిల్‌ సమావేశంలో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు మిన్నకుండాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి వైసీపీకి చెందిన సమ్మతి, అసమ్మతి కౌన్సిలర్లు రహస్య క్యాంపు శిబిరాల్లో వేర్వేరుగా ఉన్నారు. వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శంబంగి అధికార తెలుగుదేశం పార్టీపై విమర్శల దాడి చేస్తుండడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. టీడీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లను రహస్య శిబిరానికి తరలించారు. పట్టణంలో ఇరు పార్టీ శ్రేణుల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. చైర్మన్‌పై అవిశ్వాసం వీగిపోతుందని వైసీపీ వాదిస్తుండగా ఇదంతా మైండ్‌ గేమ్‌ అని, ఇక చైర్మన్‌కు పదవీగండం తప్పదని టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు గట్టిగా చెబుతున్నారు. ఎమ్మెల్యే బేబీనాయన, మాజీమంత్రి, రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్‌, ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడులు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందుకు అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు.

విప్‌ జారీ చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు

బొబ్బిలి మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విప్‌ జారీ చేశారు. ఆ విప్‌ నోటీసును ప్రిసైడింగ్‌ అధికారికి సోమవారం రాత్రి బొబ్బిలి పట్టణ వైసీపీ అధ్యక్షుడు చోడిగంజి రమేష్‌నాయుడు తదితరులు అందజేశారు. చోడిగంజి వెంట వైసీపీ మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, నాయకులు జనార్దన్‌, దమ్మా అప్పచ్చి తదితరులు ఉన్నారు.

నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహిస్తాం

జేవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు, ప్రిసైడింగ్‌ అధికారి, బొబ్బిలి

అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. నిబంధనల ప్రకారం ఓటింగ్‌ జరిపిస్తాం. కోర్టు నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు, ఉత్తర్వులు రానందున చైర్మన్‌పై వచ్చిన అవిశ్వాసం నోటీసుపై నియమావళి ప్రకారం ప్రక్రియను జరిపిస్తాం. బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్‌పీకి లేఖ రాశాం.

మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు

మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగాక వైసీపీ నుంచి గెలుపొందిన 20 మందితో పాటు ఒక ఇండిపెండెంట్‌ వైసీపీలో చేరడంతో వారి బలం 21కి చేరింది. కొద్ది నెలల ముందు 20వ వార్డు కౌన్సిలరు మరిశర్ల రామారావు నాయుడు కౌన్సిలరు పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో వైసీపీకి ప్రస్తుతం 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. తెలుగుదేశం పార్టీకి పదిమంది కౌన్సిలర్లు ఉన్నారు. కాగా వైసీపీకి చెందిన 20 మందిలో పదిమంది కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లతో జత కలిసారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసిన వారిలో పదిమంది అసమ్మతి వైసీపీ కౌన్సిలర్లు, పదిమంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న వారి సంఖ్య మొత్తం 20 కాగా, వారికి అదనంగా ఎక్స్‌ఆఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే కూడా కలవనున్నారు. అవిశ్వాసం నెగ్గితే చైర్మన్‌ సావు పదవీచ్యుతుడవుతారు. అవిశ్వాసం ఓడితే ఆయన తన పదవిలో పదిలంగా ఉంటారు. ఇండిపెండెంట్‌గా గెలిచి వైసీపీలో చేరిన కౌన్సిలర్‌కు ఆ పార్టీ జారీ చేసిన విప్‌ వర్తించదు.

Updated Date - Apr 28 , 2025 | 11:52 PM