Revenue Issues రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:47 PM
Resolve Revenue Issues ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

పార్వతీపురం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారంతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని తెలిపారు. పరిష్కారం కాని సమస్య ఉంటే అందుకు గల కారణాలను పూర్తి సమాచారంతో అర్జీదారులకు తెలియ జేయాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 88 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఎక్కువగా రీసర్వే, భూ వివాదాలు, ఉపాధి అవకాశాలు, పౌరసరఫరాల సేవలు, ఇళ్ల పట్టాలు, గృహాల మంజూరు, పింఛన్లు తదితర వాటిపై వినతులు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో అధికారి హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చెక్‌డ్యామ్ స్థలం పరిశీలన
కొమరాడ మండలం బట్టిమనుగివలస గ్రామంలోని వనకబడిగెడ్డవాగుపై నిర్మించనున్న చెక్‌డ్యామ్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. దీని నిర్మాణం పూర్తయితే సుమారు 410 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ఇందుకు రూ. పది లక్షలు వెచ్చిస్తే చాలని తెలిపారు. ఆయకట్టు ద్వారా అధిక దిగుబడి, రాబడి వచ్చే పంటల నమూనాలపై రైతులతో కలెక్టర్ చర్చించారు. ఈ పర్యటనలో పార్వతీపురం డివిజన్ నీటిపారుదలశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్.అప్పలనాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.