Share News

No Rains, No Irrigation Water! వర్షాలు కురవక.. సాగునీరు అందక!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:12 AM

No Rains, No Irrigation Water! ఓ వైపు వరుణుడు ముఖం చాటేయగా.. మరోవైపు ప్రధాన ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందకపోవడంతో జిల్లాలో ఖరీఫ్‌ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తడులు లేక వరినాట్లు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాటిని కాపుడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

No Rains, No Irrigation Water! వర్షాలు కురవక.. సాగునీరు అందక!
గరుగుబిల్లి ప్రాంతంలో నీటి తడులు లేక ఎండుతున్న వరినాట్లు

  • అధ్వానంగా కాలువలు

  • శివారు భూములకు అందని నీరు

  • వరుణుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూపు

గరుగుబిల్లి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఓ వైపు వరుణుడు ముఖం చాటేయగా.. మరోవైపు ప్రధాన ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందకపోవడంతో జిల్లాలో ఖరీఫ్‌ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తడులు లేక వరినాట్లు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాటిని కాపుడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు కురవడంతో పలు గ్రామాలకు చెందిన రైతులు వరి ఎదలు, ఉడుపులు నిర్వహించారు. ప్రస్తుతం వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో వరి ఎదలతో పాటు నాట్లు మాడుతున్నాయి. పంట పొలాలు బీడు భూముల్లా దర్శనమిస్తున్నాయి. గరుగుబిల్లి మండలంలో సుమారు 5 వేల ఎకరాలు జంఝావతి కాలువలపై ఆధారపడి ఉంది. అయితే ఆ ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఇదే ప్రాంతంలో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ఉన్నా.. ఏ ప్రయోజనం ఉండడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దిగువ ప్రాంతాలకు సాగునీరు సరఫరా అవుతుంది తప్ప గరుగుబిల్లి మండలంలో భూములకు నీరండం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పలు చెరువుల్లో నీరు చేరని పరిస్థితి ఏర్పడింది. నేల బావులు, మోటార్ల సాయంతో నీటిని తెచ్చి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

కాలువలు ఇలా..

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని పిల్ల కాలువలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. అధికార యంత్రాంగం ప్రధాన కాలువల్లో పూడికతీతలకే పరిమితమైంది. రావివలస ప్రాంతంలోని నక్కలబట్టి నుంచి మర్రాపువాని చెరువుతో పాటు పలు ప్రాంతాల్లోని పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధాన కాలువల అభివృద్ధికి నిధులు మంజూరైనా తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి. పాత బ్యారేజీ కుడి, ఎడమ కాలువల పరిధిలో గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ, బలిజిపేట, వంగర మండలాల్లో 109 గ్రామాలకు సంబంధించి పిల్ల కాలువల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా అభివృద్ధి కానరావడం లేదు. చేసిన పనులనే దఫదఫాలుగా చేస్తున్నా ఎక్కడి తుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:12 AM