విధేయతకు పట్టం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:57 PM
Loyalty is the crown పది నెలల నిరీక్షణ ఫలితమిది. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో ఉన్న ఇద్దరు నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కీలక పదవులను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

విధేయతకు పట్టం
డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున నియామకం
డీసీఎంఎస్ చైర్మన్‌గా గొంప కృష్ణ
విజయనగరం/ చీపురుపల్లి/ శృంగవరపుకోట, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పది నెలల నిరీక్షణ ఫలితమిది. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణతో ఉన్న ఇద్దరు నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు కీలక పదవులను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ డీసీఎంఎస్ చైర్మన్‌గా నియామకమయ్యారు.
కిమిడి నాగార్జున 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ సేవలందిస్తున్నారు. చీపురుపల్లిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులోకి ఉంటూ వస్తున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ 2019లోనే టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించింది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా బాధ్యతలు అప్పగించి అప్పట్లో చీపురుపల్లి టికెట్‌ను కేటాయించింది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన బొత్స సత్యన్నారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024లో రాజకీయ కారణాలు, కూటమిలో ఏర్పడిన సర్దుబాట్లు కారణంగా నాగార్జున చీపురుపల్లి స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. టికెట్ రానప్పటికీ నిరుత్సాహ పడకుండా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. టికెట్ కోల్పోయిన ఆయనను పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు పలుమార్లు పిలిపించి నామినేటెడ్ పదవిపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునను డీసీసీబీ చైర్మన్ పదవి వరించింది. కాగా నాగార్జునకు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలిలో సోమవారం సాయంత్రం బాణసంచా కాల్చారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు
డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, కష్టపడి పనిచేసే కార్యకర్తకు టీడీపీలో తప్పకుండా న్యాయం జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పదవిపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. డీసీసీబీ ద్వారా ప్రజలకు సంపూర్ణంగా మేలు కలిగేలా పనిచేస్తానని, బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
ఎన్‌ఆర్‌ఐ విభాగంలో ఉంటూ.. సేవ చేస్తూ..
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంస్) చైర్మన్‌గా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణను నియమించారు. వేపాడ మండలం కృష్ణరాయుడుపేట శివారు అంకాజోస్యలపాలెంకు చెందిన కృష్ణ ఇదివరకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో చురుగ్గా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు శృంగవరపుకోట నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ టిక్కెట్ కోసం పోటీపడ్డారు. అయితే పార్టీలో సీనియర్‌గా ఉన్న కోళ్ల లలిత కుమారికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో నిరాశ పడిన గొంప కృష్ణకు అప్పటి విశాఖ పార్లమెంటరీ స్థానం అభ్యర్థి ఎం.శ్రీభరత్ భరోసా ఇచ్చారు. లలిత కుమారి గెలుపు కోసం కృషి చేసేలా ఒప్పించారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కృష్ణకు డీసీఎంఎస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చింది.