Share News

భూముల స్వాధీనం సబబుకాదు

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:18 AM

పరిశ్రమల పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడం సబబుకాదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.

  భూముల స్వాధీనం సబబుకాదు
గిరిజనులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

రామభద్రపురం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడం సబబుకాదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు తెలిపారు. కాకర్లవలస, కారేడువలస గిరిజనులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. శనివారం ఆ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని, వారి తరపున న్యాయం జరిగే వరకు పోరాడుతానని తెలిపారు. వందేళ్లుగా ఈ భూమిపై ఆధారపడి బతుకుతున్నారని, అయితే మధ్యలో 2017లో ఏపీఐఐసీకి 174 ఎకరాలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించినట్లు గిరిజనులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు మతలబు చేశారని తెలిపారు. పదిరోజుల నుంచి గిరిజనులు ఈ భూముల కోసం ఆందోళనలు చేస్తున్నా ఇక్కడి రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. 2017లో భూములు తీసుకున్న ఏపీఐఐసీ ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయలేదని, 2013 భూసేకరణ చట్టం అనుసరించి సాగు చేస్తున్న భూములకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో మిర్తివలస సర్పంచ్‌ మజ్జి రాంబాబు, కాకర్లవలస, కారేడువలస గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:18 AM