Nominated Posts నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాకు నిరాశ
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:51 PM
District Faces Disappointment in Nominated Posts Allocation నామినేటెడ్ పోస్టుల మంజూరులో జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజయనగరం జిల్లాకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రెండు పదవుల్లో ఏదో ఒకటి తమకు వస్తుందని ఆశించిన జిల్లా సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది.

పార్వతీపురం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ పోస్టుల మంజూరులో జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజయనగరం జిల్లాకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రెండు పదవుల్లో ఏదో ఒకటి తమకు వస్తుందని ఆశించిన జిల్లా సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కొంతమంది టీడీపీ నాయకులపై రౌడీషీట్‌లను కూడా వైసీపీ నాయకులు ఓపెన్ చేయించారు. తప్పుడు కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అయితే పార్టీ కోసం ఇలా ఎన్నో కష్టాలు పడిన జిల్లా నేతలను గుర్తించకుండా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కేవలం విజయనగరం జిల్లాకే నామినేటెడ్ పోస్టులు కేటాయించడాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు పదవులు కేటాయించకుండా అధిష్ఠానం మొండి చేయి చూపిందని కొంతమంది తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం జిల్లాను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.