నాన్న ఎప్పటికీ హీరోనే!
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:54 PM
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం తండ్రి. తల్లి మాటలతో ధైర్యం చెబితే.. తండ్రి చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.

- ఆయనే మొదటి గురువు, స్నేహితుడు
- నేడు ప్రపంచ ఫాదర్స్ డే
విజయనగరం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం తండ్రి. తల్లి మాటలతో ధైర్యం చెబితే.. తండ్రి చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన మొదటి గురువు, తొలి స్నేహితుడు కూడా నాన్నే. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్‌కు బంగారు బాట వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. ప్రతి కొడుకు, కుమార్తె జీవితాల్లో నిజమైన హీరో నాన్న. తండ్రిని స్ఫూర్తిగా, ప్రేరణగా ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఉన్నతులుగా నిలిచారు. తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. మన జీవితంలో మనం ఎవరికైనా రుణపడి ఉంటాం అనుకుంటే అది కచ్చితంగా తల్లిదండ్రులకు మాత్రమే. నవమాసాలు మోసేది తల్లి అయినా.. పిల్లలను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని భరించే వాడు తండ్రి. నాన్న రెండు అక్షరాలే అయినా.. నిస్వార్థమైన ప్రేమకు, ఆత్మీయతకు అది ప్రతిరూపం. నాన్న అనే పిలుపులో బంధుత్వమే కాదు.. అంతకు మించిన భావోద్వేగం ఉంది. నాన్న కోపంగా ఉన్నా.. కఠినంగా ఉన్నా.. ఒక దెబ్బకొట్టి శిక్షించినా.. తండ్రి గుండెల నిండా ఉంటారు పిల్లలు. ఆయన ఆలోచన అంతా పిల్లల భవిష్యత్ కోసమే పరితపిస్తుంటుంది. ఎదిగే బిడ్డలను చూసి ఆనందంగా పొంగిపోతాడు. పది మందికి చెబుతూ మురిసిపోతాడు. బిడ్డల విజయాన్ని తన విజయంగా చెబుతుంటాడు. అందుకే నాన్న ఎప్పటికీ మన హీరోనే. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
ఎలా వచ్చిందంటే?
ప్రపంచ ఫాదర్స్ డేకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని ఏటా జూన్‌లో వచ్చే మూడో ఆదివారం జరుపుకొంటారు. ముందుగా అమెరికాలో ఫాదర్స్‌డేను జరుపుకునేవారు. 1910లో జూన్ మూడో ఆదివారం నాడు అమెరికాకు చెందిన సోనోరా స్మార్డ్.. ఫాదర్స్‌డేను నిర్వహించారు. సోనోరా తండ్రి పేరు విలియం జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి పిల్లలను చదివించి ప్రయోజకులను చేశారు. తన తండ్రి కష్టాలు, బాధ్యతలను దగ్గరనుంచి చూసిన సోనోరా.. ఫాదర్స్ డే జరుపుకోవాలని నిర్ణయించింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఫాదర్స్ డే ఆనవాయితీ. ఏటా ఈ రోజు తండ్రులను స్మరించుకుంటూ ఫాదర్స్‌డేను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు.
తండ్రి దిశానిర్దేశంతోనే ఈ స్థాయికి..
-ఎస్పీ వకుల్ జిందాల్
విజయనగరం క్రైం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లా ఎస్పీగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులే’నని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రపంచ ఫాదర్స్ డే పురస్కరించుకుని ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘నా తండ్రి దిశానిర్దేశంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు చదువు పట్ల ఎంతో ఆసక్తి కలిగే విధంగా ప్రోత్సహించేవారు. నాపై ఎంతో శ్రద్ధ చూపేవారు. విద్యాభ్యాసం ప్రారంభం నుంచి ఉన్నత చదువుల వరకూ ఆయన పర్యవేక్షణ వెలకట్టలేనిది. తండ్రి ప్రోత్సాహంతో చదివే ప్రతి దాంట్లో ఉన్నత స్థానంలో నిలిచాను. చివరకు సివిల్స్‌లో కూడా టాపర్ ర్యాంకర్‌గా నిలిచానంటే దాని వెనుక తల్లిదండ్రుల సపోర్టు ఎంతో ఉంది. ఐపీఎస్‌ని ఎంపిక చేసుకుని ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుతాను.’ అని ఎస్పీ తెలిపారు.
తల్లిదండ్రులు, భార్య, బాబుతో ఎస్పీ వకుల్ జిందాల్
తండ్రి రుణం తీర్చుకోలేనిది..
- నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య
విజయనగరం దాసన్నపేట, జూన్ 14: ‘మాది అతి బీద సామాన్య రైతు కుటుంబం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ముఖ్య కారకుడు మా నాన్నే. ఆయన కష్టార్జితంపై మమ్మల్ని పెంచి పెద్దచేసి ఉన్నత స్థాయికి చేర్చారు. మా తండ్రి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ రూమ్‌లో ఉండేవాడిని. ప్రతిరోజూ వంట చేసుకుని కాలేజీకి వెళ్లేవాడిని. ఇది సరికాదని భోజనం కోసం మంచి హోటల్‌లో టోకెన్లు తీసుకుని ఇచ్చారు. ఎంత ఆర్థిక ఇబ్బందులకు లోనైనా నా చదువుకు ఇబ్బంది కలగకుండా చేశారు. దీంతో నేడు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రజలకు సేవలు అందిస్తున్నాను.’ అని కమిషనర్ నల్లనయ్య తెలిపారు.
కమిషనర్ నల్లనయ్య