Share News

విశాఖ రియల్టర్‌ మామిడిపల్లిలో ఆత్మహత్య

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:32 AM

మండలంలోని మామిడిపల్లిలో వున్న ఒక ప్రైవేటు రిసార్టులో విశాఖకు చెందిన ఒక రియల్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖ రియల్టర్‌ మామిడిపల్లిలో ఆత్మహత్య

రిసార్టులో ఉరి వేసుకుని బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ లేఖ

దేవరాపల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి)

మండలంలోని మామిడిపల్లిలో వున్న ఒక ప్రైవేటు రిసార్టులో విశాఖకు చెందిన ఒక రియల్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఇన్‌చార్జ్‌ ఎస్‌.ఐ. ఆర్‌.ధనుంజయ్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి.

విశాఖపట్నంలోని సీతమ్మధారకు చెందిన నడింపల్లి సత్యనారాయణరాజు (70) నాలుగు దశాబ్దాల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు పలువురు డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లకు చేరాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తీవ్రంగా దెబ్బతిన్నాడు. కాగా దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని ఒక ప్రైవేటు రిసార్టుకు తరచూ వచ్చి పోతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇక్కడకు వచ్చిన వచ్చిన ఆయన రాత్రికి ఇక్కడే బసచేశాడు. సోమవారం ఉదయం రిసార్టు మేనేజర్‌ రాయి శివ నిద్ర లేచే సరికి గది బయట ఉన్న ఉయ్యాల కొక్కేనికి సత్యనారాయణరాజు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే రిసార్టు యాజమానికి ఫోన్‌ చేసి, ఆయన ద్వారా పోలీసులకు, సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. హెచ్‌సీ బి.ప్రకాశరావు వచ్చి పరిశీలించారు. ఆరుగురు వ్యక్తులను ఉద్దేశించి విడివిడిగా రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు రావాల్సిన బకాయిలు, తాను చెల్లించాల్సిన బకాయిల వివరాలను ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది. సత్యనారాయణరాజుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు సాయి చైతన్య వర్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Apr 29 , 2025 | 01:32 AM