Share News

ఐటీ సిటీగా విశాఖ

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:35 AM

విశాఖపట్నం చరిత్రలో ‘2025 డిసెంబరు 12’ చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ఐటీ సిటీగా విశాఖ

ఒకేరోజు తొమ్మిది సంస్థలకు శంకుస్థాపన

కాపులుప్పాడలో రూ.1,600 కోట్లతో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం

భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

25 వేల మంది ఉద్యోగులు: సీఈవో ప్రకటన

రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్‌-2పై కాగ్నిజెంట్‌ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం చరిత్రలో ‘2025 డిసెంబరు 12’ చిరస్థాయిగా నిలిచిపోనుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు తొమ్మిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేసింది. అందులో కాగ్నిజెంట్‌ది ప్రత్యేక స్థానం. గ్లోబల్‌ కంపెనీ అయిన ఈ సంస్థ విశాఖపట్నం రావడమే గొప్ప విషయం అయితే ఇక్కడ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి నడుం కట్టడం మరో విశేషం. రూ.1,600 కోట్లు వెచ్చించే ఈ భవనం తొలి దశ నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తిచేస్తామని సీఈఓ రవికుమార్‌ ప్రకటించడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు ఇస్తే ప్రతిపక్షాలు విమర్శించాయి. వాళ్లందరి నోళ్లు మూతపడేలా కాగ్నిజెంట్‌ కొత్త ప్రకటన చేసింది. తాము కేవలం ఎనిమిది వేల మందికే ఉద్యోగాలు ఇస్తామని ఎంఓయూ చేశామని, కానీ ఇక్కడి పరిస్థితులు చూశాక 25 వేల మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీఈఓ రవికుమార్‌ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా విశాఖకు గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లను రప్పించి, వాటికి రాజధానిగా మారుస్తామన్నారు. అదే గనుక జరిగితే ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలకు కొరతే ఉండదు. అదేవిధంగా భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకూ ఆగకుండా రుషికొండలో 500 మందితో తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించడం మరో విశేషం. ఇదిలావుంటే సత్వా కంపెనీ రూ.1,500 కోట్లతో ఏకంగా ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ అంటే..ఆఫీసులు, ఇళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ అన్నీ ఒకేచోట ఉండేలా భారీ నిర్మాణం చేపట్డడానికి ముందుకువచ్చింది. మూడేళ్లలో తొలి దశ నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పింది. ఇలా మొత్తం 9 కంపెనీలు శంకుస్థాపనలు చేసుకున్నాయి. త్వరలో టీసీఎస్‌ కూడా ప్రారంభం కానున్నది. గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు మొదలవుతున్నాయి. ఇవన్నీ చూసి ఒక్క విశాఖపట్నంలోనే లక్షల మందికి ఐటీలో ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని ఐటీ మంత్రి లోకేశ్‌ ధైర్యంగా ప్రకటించారు.


మెట్రో రైలు తెస్తాం

కాలుష్యం లేకుండా చేస్తాం

విశాఖలో జీవన వ్యయం 20 శాతం తక్కువ

సీఎం నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం అందమైన నగరమని, ఇక్కడ ఇతర నగరాల్లా ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవని, మెట్రో రైలు తీసుకువచ్చి ప్రయాణం మరింత సులభతరం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌కు శుక్రవారం శంకుస్థాపన చేసిన తరువాత ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ విశాఖపట్నంలో జీవన వ్యయం 20 శాతం తక్కువన్నారు. దేశంలో మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖపట్నానికి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ నగరానికి కాలుష్యం లేకుండా చర్యలు చేపడతామన్నారు. కాగ్నిజెంట్‌ సీఈఓ రవికుమార్‌ తల్లి, తాతలు, అన్నదమ్ములు అంతా విశాఖపట్నంలోనే ఉంటున్నారని, ఈ ప్రాంతం ఎవరికైనా నచ్చుతుందని, కాగ్నిజెంట్‌ ఉద్యోగులు మరింత మందిని విశాఖపట్నం రప్పించాలని కోరారు.


రాబోయే మూడున్నరేళ్లలో ఒక్క ఐటీలోనే 5 లక్షల ఉద్యోగాలు

మంత్రి నారా లోకేశ్‌

విశాఖలో ఎనిమిది ఐటీ సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన

రూ.3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

రాబోయే మూడున్నరేళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు రప్పిస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఆయన నగరంలో శుక్రవారం ఎనిమిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. రుషికొండ ఐటీ పార్కు హిల్‌-3పై కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించారు. అలాగే సత్వా ఇంటిగ్రేటెడ్‌ ఐటీ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మూడున్నరేళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ ఎనిమిది ఐటీ కంపెనీల ద్వారా రూ.3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ఒక్క విశాఖపట్నంలోనే రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఢిల్లీలో పీఎం నరేంద్రమోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు ఇద్దరూ 75 ఏళ్ల వయస్సులో యువకుల్లా రోజుకు 19 గంటలు పనిచేస్తున్నారన్నారు. హార్డ్‌ వర్క్‌ కాకుండా స్మార్ట్‌గా పనిచేయాలని చెబుతున్నారని, అది అంతా అలవాటు చేసుకోవాలన్నారు. కాగ్నిజెంట్‌ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ 500 మంది యువత విశాఖకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారి మరో 50 వేల మందిని ఇక్కడకు రప్పించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టిన ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగానే భావించి ముందుకు తీసుకువెళతామన్నారు.


ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

ఉత్పత్తి తగ్గించే చర్యలను ఏమాత్రం సహించం

కైలాసగిరి నుంచి భీమిలి వరకూ పర్యాటకానికి కోర్‌ సిటీగా అభివృద్ధి

భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రోడ్లపై ప్రత్యేక దృష్టి

ఐఎఫ్‌ఆర్‌ సమయానికి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

సీఎం నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి తగ్గించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. శుక్రవారం రుషికొండలోని ఏ-1 గ్రాండ్‌లో జరిగిన విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సమావేశంలో నగర అభివృద్ధి, పరిశ్రమల రాక వంటి అంశాలపై చర్చ సందర్భంగా ఉక్కు కర్మాగారం గురించి సీఎం ప్రస్తావించారు. కర్మాగారంలో ఉత్పత్తి తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల కన్వేయర్‌ బెల్టు రెండుసార్లు తెగిపోవడాన్ని ప్రస్తావిస్తూ ఉత్పత్తి 100 శాతం ఉత్పత్తి సాధించడం కొందరికి ఇష్టం లేదన్నారు. ఉత్పత్తికి ఆటంకాలు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోని పేర్కొంటూ ఈ ఘటనలపై విచారణ చేస్తున్నామన్నారు. కర్మాగారం రక్షణకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా పనిచేస్తుందని, ఈ సమయంలో ఉత్పత్తికి అడ్డుపడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఆంధ్రుల సెంటిమెంట్‌తో ఏర్పడిన కర్మాగారం పరిరక్షణ బాధ్యత తమదేనని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామన్నారు. అందుకు ప్రతిఒక్కరూ సహకరించి 100 శాతం ఉత్పత్తి సాధిస్తే కర్మాగారం లాభాల బాటలో పయనిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు రక్షణ ఎంత ముఖ్యమో, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అంతే బాధ్యతగా తీసుకుంటామన్నారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాఽధి లభిస్తుందన్నారు. ఆర్సెల్లార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారానికి స్లర్రీ పైపులైను వేస్తున్నందున దాంతోపాటు విశాఖ ఉక్కుకు మరో పైపులైప్‌ ఏర్పాటుకు ప్రతిపాదిస్తామన్నారు.

కైలాసగిరి నుంచి భీమిలి వరకూ 40 చదరపు కిలోమీటర్ల మేర పర్యాటకానికి కోర్‌ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. కైలాసగిరిని పర్యాటకానికి అనువుగా మరింత అభివృద్ధి చేయాలని, అక్కడ భూములు ఏఏ ప్రాజెక్టులకు అనువుగా ఉంటాయే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రోడ్లను త్వరితగతిన అభివృద్ధి చేయాలన్నారు. బీచ్‌రోడ్డులో సీఆర్‌జడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్ల అభివృద్ధిలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గంగవరం పోర్టు, విశాఖ పోర్టు కనెక్టవిటీ రోడ్లు వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది నగరంలో జరగనున్న ఐఎఫ్‌ఆర్‌కు అనువుగా మౌలికవసతులు పెంచుకోవాలన్నారు. ప్రధానంగా రోడ్లు, పార్కుల అభివృద్ధితోపాటు నగరాన్ని అందంగా తీర్చిదిద్దేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించే అమలుచేయాలని ఆదేశించారు.

Updated Date - Dec 13 , 2025 | 01:35 AM