వణికిస్తున్న వైరల్ జ్వరాలు
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:51 AM
మండలంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రోజూ 250 నుంచి 300 మంది వస్తుండగా, వారిలో జ్వర పీడితులే ఎక్కువ మంది ఉంటున్నారు.

- కోటవురట్ల మండలంలో జ్వర పీడితులు అధికం
- కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
కోటవురట్ల, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మండలంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రోజూ 250 నుంచి 300 మంది వస్తుండగా, వారిలో జ్వర పీడితులే ఎక్కువ మంది ఉంటున్నారు.
మండలంలోని రాజుపేటతో పాటు శివారు రామన్నపాలెం, రామచంద్రపాలెం, కె.వెంకటాపురం గ్రామాల్లో ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఉంటున్నారు. చాలా మందికి డెంగ్యూ లక్షణాలు ఉండడంతో నర్సీపట్నం, విశాఖపట్నంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ఆయా గ్రామస్థులు చెబుతున్నారు. కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నెల రోజుల్లో 428 మంది చికిత్స పొందారు. ఇటువంటి జ్వరాలు గతంలో ఎన్నడూ చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. దీనిపై స్థానిక సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ వివరణ కోరగా వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు వస్తున్నాయన్నారు. గ్రామాల్లో తాగునీరు కలుషితం కావడం, పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో వైరల్ జ్వరాలు వస్తున్నట్టు ఆయన చెప్పారు. వారం రోజుల నుంచి ఆస్పత్రి ఓపీ సంఖ్య రోజుకు 250 నుంచి 300 వరకు నమోదవుతోందన్నారు. ప్రజలు వేడి పదార్థాలు తీసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలని ఆయన సూచించారు.