బేకరీల్లోనూ అదే సీన్
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:25 AM
స్వీట్లు, కేకులు బాగా తింటున్నారా?, తరచూ బేకరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తున్నారా?...అయితే మీరు ఆరోగ్యం గురించి ఒక ఆలోచించుకోవాల్సిందే.

విచ్చలవిడిగా రంగులు, రసాయనాలు వినియోగం
రోజుల తరబడి నిల్వ ఉంచి విక్రయం
స్వీట్స్, కేక్స్ దుకాణాల్లో కూడా...
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో బహిర్గతం
నగరంలోని 40 షాపుల్లో సోదాలు
గడువు తీరిన వస్తువులతో అపరిశుభ్ర వాతావరణంలో ఉత్పత్తుల తయారు చేస్తున్నట్టు గుర్తింపు
39 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిన అధికారులు
16 కేసుల నమోదు
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
స్వీట్లు, కేకులు బాగా తింటున్నారా?, తరచూ బేకరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తున్నారా?...అయితే మీరు ఆరోగ్యం గురించి ఒక ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే నగర పరిధిలో స్వీట్లు, బేకరీల్లో విక్రయించే ఉత్పత్తుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, రంగులను అధిక మోతాదులో వినియోగిస్తున్నట్టు ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో బయటపడింది. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి 20 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 90 శాతం దుకాణాల్లో అత్యంత దారుణమైన వాతావరణంలో ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది రోజుల తరబడి నిల్వ ఉంచిన స్వీట్లు, కేకులు, ఇతర బేకరీ పదార్థాలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు శనివారం స్వీట్స్ దుకాణాలు, బేకరీల్లో సోదాలు చేశారు. స్వీట్లు, కేకులతోపాటు కొన్నిరకాల బేకరీ ఉత్పత్తుల తయారీలో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను అధిక మోతాదులో వినియోగిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. అలాగే గడువు తీరిన రంగులను ఉపయోగిస్తున్నట్టు తేల్చారు. ముఖ్యంగా రామ్‌నగర్‌లోని బేకరీ డెన్, తగరపువలసలోని దేవీ స్వీట్స్, మర్రిపాలెంలోని రెడ్ వాల్వెట్, మద్దిలపాలెంలోని ఎస్‌ఎస్‌ఎన్ బేకరీ, ఎన్‌ఎస్‌టీఎల్ గేటు వద్ద గల పేస్ర్టీ చెఫ్ షాపుల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొన్నిచోట్ల రెండు, మూడేళ్ల కిందట గడువు తీరిన వస్తువులను కూడా వినియోగిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎన్ బేకరీలో ఇలాంటి రంగుల సీసాలను పది వరకూ సీజ్ చేశారు. దయారం స్వీట్స్‌లో ఫంగస్ పట్టి, పాడైన బాదంపప్పును గుర్తించారు. సుమారు 60 ప్యాకెట్లు ఇలా కనిపించాయి. ఈ దుకాణంలో ఆహార పదార్థాల తయారీకి వినియోగించిన కొన్నిరకాల వస్తువుల గడువు కూడా ముగిసినట్టు గుర్తించారు. సీతమ్మధారలోని సాయిలక్ష్మీ స్వీట్స్, సీతంపేట అయ్యంగార్ బేకరీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చందు స్వీట్స్, కిసాన్ బేకరీలో నాణ్యత తక్కువగా ఉన్న బిస్కెట్లు విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన బాదంపాలు విక్రయిస్తున్నారు.
గడువు తీరినా విక్రయాలు..
అనేక దుకాణాల్లో బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్స్, కేక్స్, స్వీట్స్ తయారీకి వినియోగించే పదార్థాల గడువు తీరినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. అలాగే, ప్యాకేజీ నిబంధనల ప్రకారం వివరాలు లేని వస్తువులను గుర్తించారు. గడువు దాటి నెలలు, వారాలు గడిచిన ప్యాకెట్లను సీజ్ చేసిన అధికారులు ఆయా దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. ప్యాకేజీ నిబంధనలు పాటించని షాపులపై 16 కేసులను అధికారులు నమోదుచేశారు. మొత్తం 39 రకాల పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఆహార భద్రత, ప్రమాణాల శాఖ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు జీఏబీ నందాజీ, చక్రవర్తితోపాటు వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
తనిఖీలు చేపట్టిన దుకాణాలివే...
అధికారులు తనిఖీలు నిర్వహించిన దుకాణాల్లో ప్రముఖ బేకరీ, స్వీట్ దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో కూడా అధ్వాన పరిస్థితులు ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రెష్ చాయిస్, బేకరీ కేస్టలీ, మణికంఠ బేకరీ అండ్ స్వీట్స్ (బేకర్స్ డెన్), సిరిపురంలోని ఫుడ్ ఎక్స్, స్వీట్ ఇండియా, రామ్‌నగర్‌లోని లడ్డూ గోపాల్, శ్యామల డ్రై ఫ్రూట్స్, మద్దిలపాలెంలోని ఎస్‌ఎస్‌ఎన్ బేకరీ, క్రౌన్ బేకరీ, దయారం స్వీట్స్, శార్వాణీ స్వీట్స్, ఇసుకతోటలోని స్వగృహ స్వీట్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలోని చందు స్వీట్స్, ద్వారకానగర్‌లోని గృహప్రియ, మర్రిపాలెంలోని రెడ్‌వాల్వెట్, రైల్వే స్టేషన్ రోడ్డులోని బేకరీ ఎట్ మర్రిపాలెం, మర్రిపాలెంలోని అయ్యంగార్ బేకరీ, పేస్ర్టీ చెఫ్, పెందుర్తిలోని అంబికా స్వీట్స్, సాయిరామ్, సుజాతనగర్‌లోని గోదావరి, ఎన్‌ఏడీలోని చందు స్వీట్స్, రుచి, రెడ్ చెర్రీ బేకరీ, ఫోర్ సీజన్, ఫ్రెండ్ బేకరీ, మోహన్ స్వీట్స్, గృహ ప్రియ స్వీట్స్, శివరామ్ స్వీట్స్, బెంగళూరు అయ్యంగార్ బేకరీ, తగరపువలసలోని దేవి స్వీట్స్, మణికంఠ స్వీట్స్, పీఎంపాలెం డబుల్ రోడ్డులోని స్వీట్స్ షాప్ 1, 22, కొమ్మాదిలోని టీఎఫ్‌సీ బేకరీ, మిథులాపురి కాలనీలోని అయ్యంగార్ బేకరీ, మధురవాడలోని రెడ్ వాల్వెట్, బి ట్రీట్స్, ఎండాడలోని శ్యామల డ్రై ఫ్రూట్స్ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.