పోర్టు స్టేడియం లీజు రద్దు
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:28 AM
విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలో గల స్టేడియం లీజును రద్దు చేసింది.
‘విశ్వనాథ్ ఎవెన్యూస్’ నిబంధనలు ఉల్లంఘించడంతో చర్యలు
తక్షణం ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు
ఒప్పందాలు చెల్లవని నోటీసు ప్రదర్శన
విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలో గల స్టేడియం లీజును రద్దు చేసింది. విశ్వనాథ్ ఎవెన్యూస్‌కు పదేళ్ల కాలానికి స్టేడియంతో పాటు కళావాణి ఆడిటోరియం, నెహ్రూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్‌ను లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మరణించడంతో పోలీస్ కేసు నమోదైంది. సరైన అనుమతులు లేకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై పోర్టు యాజమాన్యం కూడా స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్టేడియం ప్రాంగణాన్ని పలువురికి సబ్ లీజుకు ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గుర్తించింది. అదేవిధంగా లీజుతో పాటు ఆదాయంలో వాటాకు సంబంధించిన అంశాల్లో లోపాలు ఉన్నాయని గుర్తించి బ్యాంక్ గ్యారంటీ డిమాండ్ చేసింది. లీజు నిబంధనలు వ్యతిరేకించారని, ఖాళీ చేయాలని నోటీసు జారీచేసింది. దీనిపై విశ్వనాథ్ ఎవెన్యూస్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. పదేళ్ల లీజు కాలం ముగియకుండానే ఖాళీ చేయమంటున్నారని, చాలా పెట్టుబడులు పెట్టామని, నష్టపోతామని పేర్కొన్నారు. ఈ కేసుల్లో పోర్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో లీజును రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీచేసింది. విశ్వనాథ్ ఎవెన్యూస్ కొంత గడువు కోరినట్టు తెలిసింది. అయితే పోర్టు యాజమాన్యం సమ్మతి తెలియజేయకుండా స్టేడియం ఖాళీ చేయకపోతే అనధికార ఆక్రమణగా గుర్తిస్తామని వెల్లడించి, ఆ మేరకు స్టేడియం ముందు పెద్ద నోటీసు బోర్డులు శుక్రవారం ఏర్పాటుచేసింది. విశ్వనాథ్ ఎవెన్యూస్తో ఎవరైనా స్టేడియం ప్రాంగణాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు చేసుకుంటే చెల్లవని పేర్కొంది.