Share News

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులకు షాక్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:17 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)లో అడ్డగోలుగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందిన వారిపై చర్యలు మొదలయ్యాయి.

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులకు షాక్‌

  • అడ్డగోలు ఇంక్రిమెంట్లు కట్‌

  • 53 మందికి జీతాలు తగ్గింపు

  • ఇప్పటివరకూ తీసుకున్న మొత్తం రికవరీపైనా కసరత్తు

  • నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పదోన్నతులపైనా దృష్టి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)లో అడ్డగోలుగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందిన వారిపై చర్యలు మొదలయ్యాయి. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు 53 మంది అక్రమార్కులు ఉన్నట్టు తేల్చి వారి జీతాల్లో కోత విధించారు. ఆగస్టు ఒకటో తేదీన బ్యాంకులో పడిన జీతాలు చూసుకున్న ఆయా ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.10 వేలు నుంచి రూ.15 వేలు కోత పడినట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు.

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో చాలాకాలంగా అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. గత మే నెలలో నిబంధనలకు విరుద్ధంగా కొత్త పీఆర్‌సీ ప్రకారం అందరికీ జీతాలు పెంచేశారు. సహకార శాఖ కమిషనర్‌ అనుమతి లేకుండానే పాత తీర్మానం ప్రకారం జీతాలు ఇచ్చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు అడ్డగోలుగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు తీసుకున్నారని ఫిర్యాదు అందడంతో దానిపై ఈపీడీసీఎల్‌ అధికారులు విచారణ చేపట్టారు. కొందరు సస్పెన్షన్‌ కాలంలో కూడా ఇంక్రిమెంట్లు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే నాలుగేళ్లకు ఒకసారి పదోన్నతి ఇవ్వాలనేది నిబంధన కాగా కొందరు రెండేళ్లకే తీసుకున్నట్టు తేలింది. సహకార శాఖ పరిధిలో సంస్థ నడిచినప్పుడు నాటి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌ కలిసి వారికి నచ్చినట్టు చేశారని తేలింది. కొందరు రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి వారు కోరుకున్న పదోన్నతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ అధికారులు ‘రేషనలైజేషన్‌’ పేరుతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎవరైతే అడ్డగోలుగా ఇంక్రిమెంట్లు, పదోన్నతులు తీసుకున్నారో జాబితా రూపొందించి, వారికి అర్హతల ప్రకారమే జూలై నెల జీతాలు ఇచ్చారు. ఇకపై అవే జీతాలు ఇస్తామని స్పష్టంచేశారు. సగటున ఒక్కొక్కరికి రూ.15 వేలు తగ్గిపోయింది. ఇప్పటివరకూ అడ్డగోలుగా, అదనంగా తీసుకున్న జీతాలను ఎలా రికవరీ చేయాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 01:17 AM