Share News

మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:43 PM

విశాఖపట్నం డిపోనకు చెందిన సీలేరు మీదుగా భద్రాచలం నడిపే ఆర్టీసీ బస్సులు కాలం చెల్లినవి, కండీషన్‌లో లేనివి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరతామో? లేదోననే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. సోమవారం ప్రయాణికులకు ఇదే పరిస్థితి ఎదురైంది.

మొరాయించిన ఆర్టీసీ బస్సు
చింతపల్లి వద్ద నిలిచిపోయిన బస్సు దృశ్యం

సాంకేతిక లోపంతో చింతపల్లిలో నిలిచిపోయిన భద్రాచలం- విశాఖపట్నం బస్సు

రెండున్నర గంటల పాటు ప్రయాణికుల అవస్థలు

ఎట్టకేలకు మరో బస్సులో తరలించిన వైనం

కండీషన్‌లో లేని, కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారని ఆవేదన

సీలేరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డిపోనకు చెందిన సీలేరు మీదుగా భద్రాచలం నడిపే ఆర్టీసీ బస్సులు కాలం చెల్లినవి, కండీషన్‌లో లేనివి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరతామో? లేదోననే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. సోమవారం ప్రయాణికులకు ఇదే పరిస్థితి ఎదురైంది.

భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సోమవారం సీలేరులో ప్రయాణికులతో నిండిపోయింది. అదనంగా 15 మంది ప్రయాణికులు నిలబడి ఉన్నారు. వీరంతా నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నానికి చెందిన వారే. ఈ బస్సు సీలేరులో ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. బస్సు జీకేవీధి మండలం ఆర్వీనగర్‌ వద్దకు వెళ్లే సరికి స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తి మలుపుల వద్ద తిరగలేదు. అయితే డ్రైవర్‌ అష్టకష్టాలు పడి నెమ్మదిగా చింతపల్లి వరకు తీసుకు వెళ్లాడు. చింతపల్లి కాంప్లెక్సు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చే క్రమంలో స్టీరింగ్‌ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర గంటల సేపు అంటే రెండున్నర గంటల పాటు బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. అధికారులకు డ్రైవర్‌ సమాచారం ఇవ్వడంతో నర్సీపట్నం నుంచి మరో బస్సును చింతపల్లికి పంపారు. దీంతో ప్రయాణికులను ఆ బస్సులో చింతపల్లి వరకు తరలించారు. అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. సీలేరు నుంచి విశాఖపట్నానికి మూడు బస్సులు మారి వెళ్లాల్సి వచ్చిందని, అది కూడా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులను పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్గాల్లో కండీషన్‌లో ఉన్న బస్సులను పంపాలని వారు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:43 PM