దివ్యాంగుల పెన్షన్లు రీ అసెస్‌మెంట్
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:13 AM
ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందుతున్నవారి రీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.

జిల్లాలో 21,306 మంది వివరాలు
పునఃపరిశీలించాల్సిందిగా ప్రభుత్వ ఆదేశం
కేజీహెచ్ సహా పలు ఆస్పత్రుల్లో పరీక్షలు
ఇప్పటివరకూ 49.02 శాతం పూర్తి
అనర్హులు ఎవరూ పెన్షన్లు పొందకూడదు...
అర్హులు ఎవరూ నష్టపోకూడదన్నదే లక్ష్యం
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందుతున్నవారి రీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం దివ్యాంగుల కేటగిరీలో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సదరం రీ అసెస్‌మెంట్‌ను చేపట్టింది. జిల్లాలో ఈ ప్రక్రియను అధికారులు జనవరిలో ప్రారంభించారు. కేజీహెచ్, కంటి, ఈఎన్‌టీ, మానసిక ఆస్పత్రులతో పాటు భీమిలి, పెందుర్తిల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి గతంలో పొందిన సదరం సర్టిఫికెట్లలో పేర్కొన్న మాదిరిగా వైకల్యం ఉన్నదీ?, లేనిదీ? పరీక్షిస్తున్నారు.
రెండు కేటగిరీలకు సంబంధించిన పెన్షనర్ల జాబితాను అధికారులకు అందించిన ప్రభుత్వం...రీ అసెస్‌మెంట్ చేయాల్సిందిగా ఆదేశించింది. పూర్తిగా వైకల్యానికి గురై రూ.15 వేలు పెన్షన్ తీసుకుంటున్నవారు ఒక కేటగిరీలో, సాధారణ వైకల్యంతో బాధపడుతూ రూ.6 వేలు పెన్షన్ పొందుతున్నవారు మరో కేటగిరీగా ఉన్నారు. జిల్లాలో రూ.15 వేలు పెన్షన్ తీసుకుంటున్నవారు 319 మంది ఉన్నారు. వారిని ఇంటింటికీ వెళ్లి పరిశీలించేలా అధికారులు వైద్య బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాల్లో జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్, ఆర్థో వైద్యులు ఉంటారు. 319 మంది రీ అసెస్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఇక విభిన్న ప్రతిభావంతులకు అందించే 6,000 పెన్షన్ పొందుతున్న వారి జాబితాకు సంబంధించి ఐదు కేటగిరీలకు చెందిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం జిల్లాలకు పంపింది. ఈ జాబితాలో కంటిచూపుతో బాధపడుతున్నవారు 2,372 మంది ఉండగా, 2,284 మంది అసెస్‌మెంట్ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. మరో 88 మందిని చూడాల్సి ఉంది. అలాగే, మానసిక సమస్యలతో బాధపడుతూ పెన్షన్ పొందుతున్నవారు 4,391 మంది ఉండగా, వీరిలో 4,125 మంది (93.94 శాతం)ని తనిఖీ చేశారు. మరో 266 మందిని పరీక్షించాల్సి ఉంది. ఎముకల సంబంధిత సమస్యల వల్ల వైకల్యానికి గురై పెన్షన్ పొందుతున్నవారు 11,481 ఉండగా ఇప్పటివరకూ 3,487 మంది (30.37 శాతం)కి రీ అసెస్‌మెంట్ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. మరో 7,994 మందికి పరీక్షించాల్సి ఉంది. అలాగే, వినికిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు 2,289 మంది ఉండగా, ఇప్పటివరకూ 549 మంది (23.98 శాతం)కి అసెస్‌మెంట్ ప్రక్రియను పూర్తిచేశారు. మరో 1,740 మందిని పరీక్షించాల్సి ఉంది. పలు రకాల వైకల్యాలతో బాధపడుతున్న 773 మంది అసెస్‌మెంట్ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. మొత్తం జిల్లాలో రీ అసెస్‌మెంట్ చేయవలసిన పెన్షనర్లు 21,306 మంది ఉండగా ఇప్పటివరకూ 10,445 మంది (49.02 శాతం)కి తనిఖీ ప్రక్రియ పూర్తయింది. మరో 10,861 మందిని తనిఖీ చేయాల్సి ఉంది.
రీ అసెస్‌మెంట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం
- పిడుగు శంకర ప్రసాద్, డీసీహెచ్‌ఎస్
పెన్షనర్ల రీ అసెస్‌మెంట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ 49 శాతం మేర పూర్తయింది. మిగిలిన వారికి స్లాట్లు కేటాయించారు. రీ వెరిఫికేషన్‌కు గడువు ఏమీ లేదు. అనర్హులు ఎవరూ పెన్షన్లు పొందకూడదు. అర్హులు ఎవరూ నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా ప్రక్రియను చేపడుతున్నాం.