‘ది డెక్’లో రైల్వే జోన్ కార్యాలయం
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:20 AM
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఎక్కడ నిర్వహించాలనేది ఎట్టకేలకు ఖరారైంది.

6, 7 అంతస్థుల కేటాయింపు
వచ్చే వారం ఎంఓయూ: ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఎక్కడ నిర్వహించాలనేది ఎట్టకేలకు ఖరారైంది. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్’ భవనంలో జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటుచేయడానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇందులో 6, 7 అంతస్థులను (సుమారు 41,500 చ.అ.) కేటాయించడానికి వీఎంఆర్‌డీఏ సుముఖత వ్యక్తంచేసింది. వాస్తవానికి గత నెలలోనే రైల్వే అధికారులు వీఎంఆర్‌డీఏ నుంచి వివరాలు తీసుకొని, ఢిల్లీలోని రైల్వే బోర్డుకు పంపించారు. కానీ దానిని వారు పట్టించుకోలేదు. ఇటీవల దీనిపై ‘రైల్వే జోన్‌కు రెడ్ సిగ్నల్స్’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన విశాఖ ఎంపీ శ్రీభరత్ అక్కడి రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడారు. వెంటనే కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. దాంతో బోర్డు అధికారులు విశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అప్‌సెట్ ధర అంటే చ.అ. రూ.70 చొప్పున ఇవ్వడానికి వీఎంఆర్‌డీఏ అంగీకరించింది.
వారం రోజుల్లో ఎంఓయూ: శ్రీభరత్
ది డెక్‌లో జోనల్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి వారం రోజుల్లో వీఎంఆర్‌డీఏ, రైల్వే మధ్య ఎంఓయూ జరుగుతుందని, ఆ తరువాత ఇంటీరియర్ పనులు ప్రారంభించి కార్యాలయం ప్రారంభిస్తారని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జోన్ గెజిట్ నోటిఫికేషన్, జోన్ ఆపరేషన్ తేదీ కూడా త్వరలోనే వస్తుందన్నారు.