Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:26 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యలపై అవగాహన

అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

నర్సీపట్నంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ

ప్రజల నుంచి 257 అర్జీలు స్వీకరణ

నర్సీపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిఇక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవితో కలిసి పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అనతరం మండల, డివిజన్‌ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సమీక్ష నిర్వహించారు. చిన్నచిన్న సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తే ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిష్కరించడానికి వీలుకాని సమస్యల గురించి సంబంధిత ఆర్జీదారులకు అర్థం అయ్యే విధంగా చెప్పాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన వస్తుందని, నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించ గలుగుతారని అన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో 257 అర్జీలు

కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఫిర్యాదుల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం టెంట్‌, కుర్చీలు, తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నిరక్షరాస్యులకు అర్జీలు రాయడానికి వీఆర్‌వోలను అందుబాటులో వుంచారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 257 అర్జీలు అందజేశారు.

వేములపూడిలోని గుండాలమ్మ చెట్టు వీధిలో చింతల నానాజీ అనే వ్యక్తి పంట కాలువ ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేశాడని అదే గ్రామానికి చెందిన నక్కపల్లి రమణ ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్మికుల 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు కోరారు. నర్సీపట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌ పక్కన వున్న తన ఖాళీ స్థలంలో గంజాయి, సారా, మద్యం కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఉంచడం వల్ల ఇబ్బందికరంగా వుందని కొలుకుల పరమేశ్వరావు ఫిర్యాదు చేశారు. గురందొరపాలేనికి చెందిన కోసూరు రాజుమ్మ.. వింతంతు పింఛన్‌ మంజూరు చేయాలని కోరింది. నర్సీపట్నంలో బ్రిటీష్‌ అధికారుల సమాధుల వున్న స్థలాన్ని అల్లూరి స్మారక ప్రాంతంగా అభివృద్ధి చేసి, ఆక్రమణలు తొలగించాలని అల్లూరి స్మారక ప్రాంతాల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ పీవీ సత్యనారాయణరావు కోరారు. ఎ.శరభవరంలో తనకు చెందిన 16 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని అదే గ్రామానికి చెందిన విచారపు నూకరాజు ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం లోసింగిలో ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వాలని అర్జీ అందజేశారు.

Updated Date - Apr 29 , 2025 | 01:26 AM