మేయర్ పీఠంపై పీలా
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:15 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నూతన మేయర్‌గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవంగా ఎన్నిక
ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి 59 మంది కార్పొరేటర్లు, ఎనిమిది మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు హాజరు
కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత టీడీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన రెండో వ్యక్తి
విలువలకు లోబడి, విధానలకు కట్టుబడి పనిచేస్తానని ప్రకటించిన పీలా
జీవీఎంసీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల సంబరాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నూతన మేయర్‌గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై ఈనెల 19న కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. కొత్త మేయర్ ఎన్నిక కోసం సోమవారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మయూర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.
కౌన్నిల ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సభకు 59 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం 67 మంది హాజరవ్వడంతో ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం మేయర్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను సభ్యులకు ఆయన వివరించారు. ఆ తరువాత మేయర్‌గా పోటీ చేసే అభ్యర్థిని ఎవరైనా ఒక సభ్యుడు ప్రతిపాదించి, మరొక సభ్యుడు బలపరచాలని కోరారు. దీంతో జనసేనకు చెందిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రతిపాదించారు. బీజేపీకి చెందిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు బలపరిచారు. ఇంకెవరైనా పోటీలో ఉన్నారా?...అని ఎన్నికల అధికారి ప్రశ్నించగా, సభ్యులంతా ఎవరూ లేరని చెప్పడంతో మునిసిపల్ చట్టం రూల్ నంబర్ 62 ప్రకారం పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. సభ్యులందరూ బల్లలు చరిచి హర్షం వ్యక్తంచేశారు. మేయర్‌గా ఎన్నికైనట్టు పీలా శ్రీనివాసరావుకు జాయింట్ కలెక్టర్ ధ్రువీకరణ పత్రం అందజేసి, ఆయన చేత ప్రమాణం చేయించి సమావేశం ముగిసినట్టు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కూటమి కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు, కూటమి నేతలతోపాటు అభిమానులు నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.
మేయర్‌గా పీలా ఎన్నికతో జీవీఎంసీ కార్యాలయం బయట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయన అభిమానులు క్రేన్‌పై భారీ గజమాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేస్తానన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్టు విలువలతోపాటు పార్టీ, ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేస్తానన్నారు. తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన కార్పొరేటర్లు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లలో వైసీపీ నేతలు జీవీఎంసీలో చేసిన అవినీతి కారణంగానే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందన్నారు. వైసీపీ నేతలు ఆరోపించినట్టు తాము కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయలేదని, బెదిరించలేదని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలను భరించలేక స్వచ్ఛందంగా మేయర్‌ను దింపేందుకు తమతో కలిసి వచ్చారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, నగర అభివృద్ధికి అందరం ఐక్యంగా పనిచేస్తామన్నారు. కార్పొరేషన్ చరిత్రలో టీడీపీ నుంచి 1987లో మొదటిసారి డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికవ్వగా, రెండో వ్యక్తి పీలా శ్రీనివాసరావు కావడం విశేషం.
నూతన మేయర్ బయోడేటా:
పేరు: పీలా శ్రీనివాసరావు
పుట్టిన తేదీ: 17-11-1968
తండ్రి: పీలా మహలక్ష్మినాయుడు
రెండుసార్లు పెందుర్తి మండల అధ్యక్షునిగా పనిచేశారు
రాజకీయప్రవేశం: 1985 నుంచి టీడీపీలో క్రీయాశీలకం
పార్టీ పదవులు: పెందుర్తి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు, విశాఖ జిల్లా తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్, 2007-12 వరకు నగర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, 2021 నుంచి జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్
భార్య: పీలా ధనలక్ష్మి, గృహిణి
కుమారుడు: ధీరజ్‌నాయుడు
కుమార్తె: డాక్టర్ జీవితశ్రీ
నగర అభివృద్ధికి నా శక్తిమేరకు కృషి
ప్రజలకు అందుబాటులో ఉంటా
సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా
వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం
వైసీపీ పాలనలో అవినీతిపై సమీక్షించి చట్టప్రకారం చర్యలు
నూతన మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని ప్రజా ప్రతినిధులందరితో సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధికి తన శక్తి మేర కృషిచేస్తానని మేయర్‌గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావు అన్నారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జీవీఎంసీ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఎంతో కీలకమైన మేయర్ పదవిని తనకు అప్పగించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలతోపాటు కూటమి ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లకు రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబునాయుడును స్ఫూర్తిగా తీసుకుని నగర పరిధిలోని సమస్యల పరిష్కారానికి అలుపెరగకుండా కృషిచేస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో నగరాన్ని అధోగతి పాల్జేశారని, వీధి లైట్లు వెలిగించుకోలేని దుస్థితికి జీవీఎంసీని నెట్టేశారని పీలా విమర్శించారు. మేయర్‌గా తనకు తక్కువ కాల వ్యవధే ఉన్నప్పటికీ...ఉన్నంతలో బాగా చేశానని ప్రజలు అనుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి వార్డులోనూ వీధి లైట్లు వెలిగేలా చేయడంతోపాటు పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. వేసవిలో తాగునీరు సక్రమంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఒక కార్యాచరణ రూపొందించుకుని దానిప్రకారం అధికారులతో కలిసి నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో చాలా లోపాలు ఉన్నాయని, వాటిపై సమీక్షించిన తర్వాత చట్ట ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గంధం శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, తదితరులు పాల్గొన్నారు.