Share News

నేతన్న జీవితాల్లో వెలుగు

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:52 AM

చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆర్థికంగా చితికిపోయిన వారి బతుకుల్లో వెలుగులు నింపింది. పవర్‌లూమ్స్‌కు 500, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలోని చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

నేతన్న జీవితాల్లో వెలుగు
. నేత పనిలో నిమగ్నమైన కార్మికుడు

- చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

- జిల్లాలో 560 మందికి ప్రయోజనం

- ఈ నెల 1 నుంచే అమల్లోకి..

- హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

- నేత కార్మికుల ఆనందోత్సాహం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆర్థికంగా చితికిపోయిన వారి బతుకుల్లో వెలుగులు నింపింది. పవర్‌లూమ్స్‌కు 500, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలోని చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఎన్నికల ముందు కూటమి నాయకులు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌పై ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్ర సమయంలో పాయకరావుపేటలో చేనేత కార్మిక కుటుంబాలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో నేతన్నల అభ్యర్థన మేరకు ఉచిత విద్యుత్‌పై నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నేతన్నల ఇళ్లకు ఉచితంగా 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించనున్నట్టు ప్రకటించడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పవర్‌లూమ్స్‌ వినియోగించే చేనేత కుటుంబాలు లేకపోయినా ఇంటి వద్దే మగ్గాలపై చేనేత పనులు చేసుకొనే కుటుంబాలు సుమారు 850 వరకు ఉన్నాయి. సుమారు 560 మంది మగ్గాలను వినియోగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి నెలా 200 యూనిట్లు ఉచితంగా అందించనున్నారు. వాస్తవానికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కుటుంబాలకు ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్‌ అందించాలని తొలుత నిర్ణయించినా, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వారం రోజుల ముందు అంటే ఈ నెల 1వ తేదీ నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నేతన్నలకు నెలకు కేవలం 100 యూనిట్లు విద్యుత్‌ మాత్రమే ఉచితంగా అందించగా, కూటమి ప్రభుత్వం 200 యూనిట్లు వరకు ఉచితంగా ఇస్తుండడంతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.950 నుంచి రూ.1,250 వరకు లబ్ధి చేకూరనున్నదని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 200 యూనిట్లు దాటి విద్యుత్‌ వినియోగించే నేతన్నలు అదనంగా వినియోగించిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పాయకరావుపేట, నర్సీపట్నం, నక్కపల్లి, కశింకోట, కె.కోటపాడు మండలాల్లో చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వారు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే చేనేత కుటుంబాల వివరాలను సేకరిస్తున్న జిల్లా చేనేత, జౌళి శాఖాధికారులు త్వరలోనే అర్హులకు ఉచిత విద్యుత్‌ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:52 AM