డీసీసీబీ చైర్మన్‌గా కోన తాతారావు
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:16 AM
విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా కోన తాతారావును ప్రభుత్వం నియమించింది.

జనసేన కోటాలో ఎంపిక
రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా కోన తాతారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తాతారావు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో కూటమి పార్టీల మధ్య ఉన్న అవగాహన మేరకు విశాఖ డీసీసీబీ పోస్టును జనసేనకు కేటాయించడంతో తాతారావుకు అవకాశం లభించింది.
రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సొసైటీలకు 2018 తరువాత ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచీ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తమ పార్టీకి చెందిన వారిని చైర్మన్లుగా నామినేట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చివరిలో డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన కోలా గురువులు గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి జాయింట్ కలెక్టర్ పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూటమి ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో సోమవారం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లను నియమించింది. చైర్మన్‌గా కోన తాతారావు నియామకంపై రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయనతోపాటు డీసీసీబీ బోర్డులో మరో ఆరుగురిని ప్రభుత్వం నియమించనున్నది. ఇదిలావుండగా ఈనెల ఎనిమిదో తేదీన కోన తాతారావు పరవాడ మండలం లంకెలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 30కుపైగా బ్రాంచీలు, 98 సహకార సంఘాలు కలిగిన డీసీసీబీ రాష్ట్రంలో అత్యధిక వ్యాపార లావాదేవీలు జరిపే ఐదింటిలో ఒకటిగా ఉంది.
ఉక్కు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి...
పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన కోన తాతారావు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. నిర్వాసితుడు కోటాలో విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగిగా చేరి మేనేజర్ హోదా వరకూ పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత పెదగంట్యాడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తాతారావు ఉమ్మడి రాష్ట్రంలో 1993లో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, తరువాత చైర్మన్‌గా సేవలు అందించారు. 2004లో కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరిన తాతారావు 2007లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. జీవీఎంసీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, 2009లో అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో టీడీపీని వీడి జనసేనలో చేరిన తాతారావు ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు.