బీఎన్ రోడ్డుకు మోక్షం లేదా?
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:27 AM
చోడవరం నియోజకవర్గంలో ప్రధానమైన భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నది.

ప్రకటనలకే పరిమితమైన కూటమి నేతల మాటలు
అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా మొదలుకాని పనులు
గోతులతో మరింత అధ్వానంగా మారిన రహదారి
వర్షాలు మొదలైతే ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
చోడవరం, ఏప్రిల్ 28:
చోడవరం నియోజకవర్గంలో ప్రధానమైన భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన ్నంగా తయారైన ఈ రోడ్డు.. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు. ‘కాంట్రాక్టర్లతో మాట్లాడాం. పనులు ప్రాంభం అవుతాయి’ అని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, జనసేన ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలేదు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ స్వయంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడినా.. రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు. మరో ఐదారు వారాల్లో వర్షాకాలం మొదలవుతుంది. అప్పటి నుంచి రవాణా కష్టాలు మరింత పెరుగుతునాయని ఈ మార్గంలో తరచూ ప్రయాణించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీఎన్ రోడ్డులో చోడవరం మండలం గంధవరం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు 45 కిలోమీటర్లు, బీఎన్ రోడ్డులో వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు 15 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారుల విస్తరణ, అభివృద్ధికి న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రూ.130 కోట్లు మంజూరు చేసింది. కానీ వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్డు పనులు జరగలేదు. మరోవైపు నిర్వహణ పనులు కూడా చేయకపోవడంతో రహదారులు మరింత ఛిద్రమై అధ్వానంగా తయారయ్యాయి. అడుగడుగునా గోతులు ఏర్పడి, రానురాను పెద్దవి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ప్రజలు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అఽభ్యర్థులను ఘోరంగా ఓడించారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో బీఎన్ రోడ్డు, వడ్డాది- తాటిపర్తి రోడ్లు పనులు ప్రారంభం అవుతాయని ప్రజలు భావించారు. వడ్డాది- తాటిపర్తి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు మొదలై జోరుగా సాగుతున్నాయి. కానీ బీఎన్ రోడ్డు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అక్కడక్కడ తాత్కాలికంగా గుంతలను పూడ్చినా, పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు రోలుగుంట నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు పనులు చేయడానికి అంగీకరించిన సబ్ కాంట్రాక్టర్.. పనులు జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. వైసీపీ హయాంలో బీఎన్ రోడ్డు పనులు చేయించలేకపోయారని విమర్శలు చేసిన కూటమి నేతలు, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అదే పరిస్థితి తమకు ఎదురవడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
కొత్త వంతెనలకు మోక్షం లేదా?
బీఎన్ రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం వడ్దాది వద్ద రెండేళ్ల క్రితం వంతెన కూలిపోయింది. ఇక్కడ ప్రత్యామ్నాయంగా తక్కువ ఎత్తులో కల్వర్టు నిర్మించారు. ఆరు నెలల తరువాత విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై వంతెన కూలిపోయింది. ఈ రెండు చోట్ల కొత్త వంతెన నిర్మాణం ఊసేలేదు. విజయరామరాజుపేట వద్ద కూలిన వంతెన పక్కన నిర్మించిన అప్రోచ్ రోడ్డు ప్రమాదకరంగా ఉంది. నదుల్లో వరద పెరిగితే వడ్డాది వద్ద కల్వర్టు, విజయరామరాజుపేట వద్ద అప్రోచ్ రోడ్డుమీదుగా నీరు ప్రవహించి వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి.
ప్రతిపాదనల్లోనే రెండు వరుసల రహదారి నిర్మాణం
బీఎన్ రోడ్డును పీపీపీ విధానంలో రెండు లేన్ల రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ రహదారి అభివృద్ధి బాధ్యతను ఈసీసీ అనే కంపెనీకి అప్పగించారు. కానీ డీపీఆర్ తయారీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. రోడ్డు నిర్మాణంలో భూములు, స్థలాలు కోల్పోయే వారి వివరాలు, మధ్యలో గెడ్డలు, నదులపై నిర్మించాల్సిన వంతెనలు, కల్వర్టులు, తదితర వివరాలతో డీపీఆర్ తయారీకి కనీసం ఏడాది పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇది పూర్తయి, డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపి, టెండర్లు పిలిచి, రోడ్డు నిర్మాణ పనులు మొదలు కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. అప్పటికి బీఎన్ రోడ్డు మరింత అధ్వానంగా తయారవుతుంది.