Share News

బడుల్లో అసంపూర్తిగానే నిర్మాణాలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:27 AM

పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల పునఃప్రారంభం మరికొంత ఆలస్యమయ్యేలా ఉంది.

బడుల్లో అసంపూర్తిగానే నిర్మాణాలు

  • కమిటీల ఖాతాల్లో ఉన్న నిధులు వినియోగించవద్దని విద్యా శాఖ ఆదేశాలు

  • ‘మనబడి-మన భవిష్యత్తు’కు గత వారం రూ.250 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

  • పనులు పూర్తవుతాయని భావించిన జిల్లా అధికారులు

  • అయితే...ఆ నిధులు సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌

  • బకాయిల నిమిత్తం విడుదల చేసినట్టు వెల్లడి

విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):

పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల పునఃప్రారంభం మరికొంత ఆలస్యమయ్యేలా ఉంది. ప్రస్తుతం పాఠశాల అభివృద్ధి కమిటీ ఖాతాల్లో ఉన్న నిధులతో ఆ పనులు చేయవద్దని విద్యా శాఖ ఆదేశించింది. గత ప్రభుత్వం నాడు-నేడు పథకం రెండో దశ పనులు 2022లో ప్రారంభించింది. జిల్లాలోని 309 పాఠశాలల్లో మౌలిక వసతులు అంటే అదనపు గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, లేబొరేటరీలు, లైబ్రరీలు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఎల్‌ఈడీ ఫ్యాన్ల ఏర్పాటుకు సుమారు రూ.115 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రెండో దశకు మొదటి నుంచి నిధుల సమస్య వెంటాడింది. రూ.48.73 కోట్లు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం రూ.46.35 కోట్ల విలువైన మెటీరియల్‌ సరఫరా చేసింది. అందుబాటులో ఉన్న నిధులు, మెటీరియల్‌తోనే పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. అయితే అనుకున్న లక్ష్యం మేర పనులు పూర్తికి నిధుల సమస్య ఏర్పడింది. మొత్తం 522 అదనపు గదుల నిర్మాణం చేపట్టగా, చాలావరకూ మధ్యలో ఉండిపోయాయి.

చంద్రంపాలెం ఉన్నత పాఠశాల సహా పలుచోట్ల రెండేళ్ల నుంచి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో తరగతి గదులు చాలని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పాఠశాలల ఆవరణల్లో ఇసుక, రాళ్లగుట్టలు ఉండడం ఇబ్బందిగా ఉంది. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా కొనుగోలు చేసిన తలుపులు, కిటికీలను అమర్చేందుకు సంబంధిత కాంట్రాక్టర్లు ఇప్పటివరకూ రాలేదు. అవి కూడా పాఠశాలల్లో ఒకచోట ఉంచారు. అయితే కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తిచేయగా, సుమారు రూ.80 లక్షల వరకు కమిటీల ఖాతాల్లో ఉన్నాయి. ఈ నిధులతో కొన్ని పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం పూర్తిచేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆ నిధులు ఖర్చు చేయవద్దని ఇటీవల విద్యా శాఖ ఆదేశించింది.

ఇదిలావుండగా గత వారం మనబడి-మన భవిష్యత్తు పనులకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేయవచ్చునని అధికారులు భావించారు. జిల్లాలో 309 పాఠశాలల్లో పనులు పూర్తికావాలంటే రూ.30 కోట్లు అవసరమని విద్యా శాఖలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు నివేదిక రూపొందించారు. అయితే ఆ నిధులను రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అవసరమైన పలు రకాల మెటీరియల్‌ సరఫరా చేసే సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో పెండింగ్‌ పనులు పూర్తికి ప్రత్యేకించి నిధులు మంజూరుచేసేంత వరకూ ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 01:27 AM