Share News

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:03 AM

విద్యా హక్కు చట్టం 12 (1)సి ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికిగాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రోజెక్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖరరావు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు

  • ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయింపు

  • ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలకు అవకాశం

  • మే 2 నుంచి దరఖాస్తుల స్వీకారం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

విద్యా హక్కు చట్టం 12 (1)సి ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికిగాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రోజెక్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖరరావు తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు (అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓపెన్‌ కేటగిరీ) ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు మే నెల రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులను ‘సీఎస్‌ఈ.ఏపీ.జీవీవో. ఇన్‌’ వెబ్‌సైట్‌ లేదా సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యాశాఖాధికారికి స్వయంగా అందజేయాలని ఆయన సూచించారు. విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఆ వర్గాలకు కేటాయించాలన్నారు. ఐబీ/సీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈలో ప్రవేశాలు పొందేందుకు మార్చి 31 నాటికి ఐదేళ్లు, రాష్ట్ర సిలబస్‌లో ప్రవేశాలకు మే 31 నాటికి ఐదేళ్లు పూర్తయిన బాలబాలికలు ఒకటో తరగతిలో ప్రవేశాలకు అర్హులన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో 621 ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టం 12(1)సీ కింద నమోదైనట్టు వెల్లడించారు. కాగా ప్రవేశాలకు సంబంధించి సోమవారం ఆయన మండల విద్యాశాఖాధికారులు, కార్యాలయ సిబ్బందితో సమీక్షించారు.

భర్త పింఛన్‌ భార్యకు...

  • జిల్లాలో 1,559 మందికి ‘స్పౌజ్‌’ పింఛన్లు మంజూరు

  • వచ్చే నెల తొలి వారంలో పంపిణీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వ్యక్తి స్థానంలో అతని భార్యకు వచ్చే నెల తొలివారంలో పింఛన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. 2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు మధ్య చనిపోయిన వారికి సంబంధించి ఇప్పుడు పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పించాలని సచివాలయ సిబ్బంది తమ పరిధిలో ఉన్నవారికి సమాచారం ఇచ్చారు. జిల్లాలో 2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు 1,559 మంది చనిపోగా వారి పింఛన్లు భార్యకు మంజూరు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి 1,000 మందికిపైగా దరఖాస్తు చేశారు. వీరి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. వీరందరికీ మేనెల మొదటి వారంలో పింఛన్లు పంపిణీచేస్తారు.

మే ఒకటిన సామాజిక పింఛన్లు పంపిణీ

జిల్లాలో సామాజిక పింఛన్లు మే నెల ఒకటో తేదీ...గురువారం పంపిణీ చేస్తారు. మొత్తం 1,59,581మందికి రూ.69.64 కోట్లు విడుదలైంది. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,404 మందికి రూ.11.09 కోట్లు, జీవీఎంసీ పరిధిలోని ఏడు జోన్ల (అనకాపల్లి జోన్‌లో అనకాపల్లి జిల్లా అధికారులు పంపిణీ చేస్తారు)లో 1,33,177 మందికి రూ.58.54 కోట్లు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 01:03 AM