యుద్ధప్రాతిపదికన భూ ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:41 PM
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
వారంలో భూ ఆక్రమణలపై సర్వే పూర్తి చేయాలని సూచన
పాడేరు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వారం రోజుల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపునకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. గ్రామ సర్వేయర్, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా గ్రామాల్లో బంజరు భూములు, గ్రామకంఠం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేసి నివేదించా లన్నారు. సర్వే ప్రక్రియలో రెవెన్యూ, సర్వే అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. తొలుత ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి, వారం గడిచిన తర్వాత ఆక్రమణలను తొలగించాలన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణం చేపడితే తొలగించాలన్నారు రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా యుద్ధప్రాతిపదికన భూముల ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల భూముల ఆక్రమణలను గుర్తించి తొలగించాలన్నారు. గ్రామకంఠం భూముల్లో అధికారికంగా, అనధికారికంగా ఎవరు ఉంటున్నారో గుర్తించాలని, రోడ్లు, భవనాల శాఖ భూములను గుర్తించి డీ మార్కు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, సర్వే విభాగం ఏడీ కె.దేవేంద్రుడు, డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్, రోడ్లు,భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, జల వనరుల శాఖ ఈఈ ఆర్.రాజేశ్వరరావు, డీఈఈ ఆర్.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.