Share News

డ్వాక్రా దుకాణాలకు పైరవీలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:18 AM

నగరంలోని రైతుబజార్లలో దుకాణాల కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు పోటీ పడుతున్నారు.

డ్వాక్రా దుకాణాలకు పైరవీలు

  • నగరంలోని 13 రైతుబజార్లలో 72 దుకాణాలు

  • టమాటా, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు విక్రయించుకునే అవకాశం

  • వ్యాపారం బాగుండడంతో భారీగా దరఖాస్తులు

  • రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నజరానాలు

  • ఎమ్మెల్యేల ద్వారా సిఫారసులు

  • జేసీ సమక్షంలో లాటరీ రేపు

  • పారదర్శకంగా జరిగేనా?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని రైతుబజార్లలో దుకాణాల కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రూపు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ నజరానాగా సమర్పించడానికి సిద్ధపడుతోంది.

విశాఖ జిల్లాలో మొత్తం 13 రైతుబజార్లు ఉండగా, వాటిలో 72 డ్వాక్రా దుకాణాలు, మరో 28 దివ్యాంగుల దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలని గత నెలలో జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు. ప్రతి డ్వాక్రా గ్రూపు మూడేళ్ల తరువాత ఖాళీ చేసి వెళ్లిపోవాలనే నిబంధనతో ఈ దుకాణాలు కేటాయిస్తున్నారు. వీటి ద్వారా బజార్లలో టమాటా, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు విక్రయించుకునే అవకాశం ఉంది. భారీగా వ్యాపారం జరుగుతున్నందున వీటి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు భారీగా దరఖాస్తులు రావడంతో సోమవారం సాయంత్రం జాయింట్‌ కలెక్టరేట్‌ సమక్షంలో లాటరీ తీసి కేటాయించాలని నిర్ణయించారు.

తెర వెనుక లాబీయింగ్‌

రైతుబజార్లలో వ్యాపారానికి, అక్కడి లాభాలకు అలవాటుపడిన డ్వాక్రా గ్రూపులు మళ్లీ మళ్లీ దుకాణాలు దక్కించుకోవాలని యత్నిస్తున్నాయి. అందుకని అదే గ్రూపులో వేరే సభ్యుల పేరుతో దరఖాస్తులు సమర్పించారు. మరికొందరు వేరే గ్రూపులో చేరి ఆ పేరుతో దరఖాస్తు చేశారు. వీటిని పరిశీలించే బాధ్యత సిటీలో మెప్మాకు, జిల్లాలో డీఆర్‌డీఏకు అప్పగించారు. దాంతో పాటు గోపాలపట్నంలోని మార్కెటింగ్‌ శాఖాధికారులు కూడా పరిశీలిస్తున్నారు. కొత్త గ్రూపులకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన. కానీ ఎలాగైనా మళ్లీ దక్కించుకోవాలని కొన్ని డ్వాక్రా గ్రూపులు యత్నిస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యేలు, వారి దగ్గర వ్యక్తిగత సహాయకులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందుకోసం వారు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ముట్ట జెబుతున్నారు. ఈ మొత్తాలను కొందరు హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద తీసుకొని మరీ ఇస్తున్నారు. దుకాణం వస్తే ఆ వ్యాపారుల దగ్గరే అన్నీ కొనాలనేది ఒప్పందం. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే పదేసి గ్రూపుల పేర్లు సిఫారసు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే తమ వారికి ఫలానా బజారులోనే దుకాణం ఇవ్వాలని ఒత్తిడి పెడుతున్నారు. ఇన్ని సిఫారసుల మధ్య లాటరీ పారదర్శకంగా జరిగే అవకాశం లేదు. గతంలో కూడా మార్కెటింగ్‌ శాఖలో ఓ అధికారి చక్రం తిప్పి వారి మనుషులకు ప్రధాన బజార్లలో దుకాణాలు ఇప్పించుకున్నారు. అప్పుడు కూడా లాటరీయే తీశారు కానీ వారికి అవసరమైనవి దక్కించుకున్నారు. ఆ అధికారి ఇప్పుడు లేకపోయినా మళ్లీ అదే తంతు నడిపించాలని కొందరు యత్నిస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఈ విషయంలో ఎవరినీ విశ్వసించకుండా, ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా లాటరీ తీయాలని దరఖాస్తుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 01:18 AM