వసతి గృహం ఖాళీ
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:59 AM
స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం బాలికలు కోతుల దాడితో భయపడి హాస్టళను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వసతిగృహం బోసిపోయింది.
దిద్దుబాటు చర్యలు చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు
రావికమతం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం బాలికలు కోతుల దాడితో భయపడి హాస్టళను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వసతిగృహం బోసిపోయింది.
రావికమతంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో 96 మంది విద్యార్థినులు వుంటున్నారు. గత ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కోతులు గోడ దూకి లోపలికి వచ్చి పాల్లిక స్నేహ, సీదరి మంగలపై దాడిచేసి శరీరంపై పలుచోట్ల కరిచాయి. వార్డెన్ వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించిన తల్లిదండ్రులకు అప్పగించి వారి ఇళ్లకు పంపించివేశారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులు మరుసటి రోజు హాస్టల్కు వచ్చి ఆందోళనకు దిగారు. కోతుల బెడదను నివారించే వరకు తమ పిల్లలను హాస్టల్లో వుంచేది లేదంటూ పలువురు బాలికలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆయా విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి భరోసా ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు, బాలికలు వినలేదు. తరువాత రోజూ కొంతమంది చొప్పున హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో గురువారం సాయంత్రానికి వసతిగృహం మొత్తం ఖాళీ అయ్యింది. ఇదిలావుండగా హాస్టల్ మేట్రిన్గా లలిత విధుల నిర్వహిస్తుండగా, నాతవరం హాస్టల్ నుంచి వార్డెన్ ఎం.రాజేశ్వరరావును సహాయకులుగా నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోతుల బెడదను నివారించడానికి హాస్టల్ ఆవరణలో తుప్పలతోపాటు చెట్ల కొమ్మను శుక్రవారం నరికించారు. అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను బాగు చేయిస్తున్నారు.