Share News

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై సృష్టత ఇవ్వాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:28 PM

మండలంలోని గుమ్మకోట పంచాయతీ దబ్బలపాడు నుంచి చిప్పపల్లి వరకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వద్దు.. పచ్చని కొండలే ముద్దు అంటూ గిరిజనులు నినాదాలు చేశారు.

 హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై సృష్టత ఇవ్వాలి
దబ్బలపాడు నుంచి చిప్పపల్లి వరకు ర్యాలీ చేపడుతున్న గిరిజనులు

దబ్బలపాడు నుంచి చిప్పపల్లి వరకు గిరిజనుల ర్యాలీ

రెండు రోజుల క్రితం వెలసిన సరిహద్దు రాళ్లు

సమాచారం లేదంటున్న తహశీల్దార్‌

అనంతగిరి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మకోట పంచాయతీ దబ్బలపాడు నుంచి చిప్పపల్లి వరకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వద్దు.. పచ్చని కొండలే ముద్దు అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. అనంతరం చిప్పపల్లి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలోని సర్పంచ్‌ పాంగి అప్పారావు అధ్యక్షత వహించగా.. ఎంపీపీ శెట్టి నీలవేణి, జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడారు. పార్వతీపురం మన్యంలోని ప్రాజెక్టులు రద్దు చేసినా.. అల్లూరి జిల్లాలోని రద్దు చేయకపోడానికి ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా సరిహద్దు రాళ్లు ఏర్పాటుపై మండిపడ్డారు. దబ్బలపాడు, బురదగెడ్డ, గుమ్మకోట, గుజ్జెలి తదితర ముప్పు గ్రామాల గిరిజనులు ర్యాలీలోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని టోకూరు సర్పంచ్‌ మోస్య, నాగులు, తదితరులు ఉన్నారు.

మూడుచోట్ల సరిహద్దు రాళ్లు

మండలంలోని గుమ్మకోట పంచాయతీ శంకుపర్తి, దబ్బలపాడు, శతాబి వద్ద మూడు చోట్ల రెండు రోజుల క్రితం సరిహద్దు రాళ్లు ఏర్పాటు కావడంపై గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దు రాళ్ల ఏర్పాటుపై తహశీల్దార్‌ వీరభద్రచారిని వివరణ కోరగా.. సరిహద్దు రాళ్లు ఎవరు ఏర్పాటు చేశారనేది సమాచారం లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ఆందోళనకారులకు ఎస్‌ఐ ఎస్‌ఐ శ్రీనివాసరావు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Updated Date - Aug 02 , 2025 | 11:28 PM