Share News

AP Tourism: గిరిజన పల్లెల్లో.. హోమ్ స్టే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:27 PM

పర్యాటకంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పించేలా అతిథి పర్యాటకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే పర్యాటకులు స్థానిక గిరిజన పల్లెల్లోనే బస చేసి, అక్కడ గిరిజనులు చేసే వంటకాలను రూచి చూసేలా ‘హోమ్‌ స్టే’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లో 171 గ్రామాల్లో 1,083 ఇళ్లను హోమ్‌ స్టేకు సిద్ధం చేస్తున్నారు.

AP Tourism: గిరిజన పల్లెల్లో..  హోమ్ స్టే..
పాడేరు మండలంలో మోదాపల్లి గిరిజన గ్రామం

‘హోమ్‌ స్టే’ పేరిట పర్యాటకులకు

స్థానిక వసతి, భోజన సదుపాయాల కల్పనకు చర్యలు

జిల్లాలో 15 మండలాల్లో 171 గ్రామాల్లో

1,083 ఇళ్లను సిద్ధం చేసేందుకు సన్నాహాలు

పర్యాటక సీజన్‌ నాటికి అందుబాటులోకి..

పాడేరు: మన్యంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు స్థానికంగా గిరిజన పల్లెల్లోని బస చేసి వారి జీవన విధానాన్ని చూడాలని భావిస్తారు. గిరిజన పల్లెల్లో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో అటువంటి సందర్శకులకు పల్లెల్లో గిరిజనుల ఇళ్లల్లోనే వసతి ఏర్పాటు చేసి, వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి పర్యాటకులు అందించేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మన్యంలో పర్యటించే సందర్శకులకు ప్రకృతి అందాలతో పాటు గిరిజన పల్లెల్లో స్థితిగతులను స్వయంగా తిలకించామనే అనుభూతి కలుగుతుంది. అలా చేస్తే గిరిజనులకు ఉపాధి, ఆదాయం సైతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


171 గ్రామాల్లో 1,083 ఇళ్లు ఎంపిక

అతిథి పర్యాటకంలో భాగంగా జిల్లాలో 15 మండలాల్లోని 171 గ్రామాల్లో 1,083 ఇళ్లను ఎంపిక చేశారు. ఈక్రమంలో గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. గిరిజన లబ్ధిదారులకు పీఎం జన్‌మన్‌ పథకంలో కొత్త ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో కొత్త ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు చెందిన పాత ఇళ్లను హోమ్‌ స్టేకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఎంపిక చేసిన ఇళ్లను జిల్లా పర్యాటకాధికారి జి.దాసు ఆధ్వర్యంలో ఏపీ టూరిజం ఆర్కిటెక్చర్‌ నిషితాగోయల్‌, ఇంజనీరింగ్‌ అధికారి రాము బృందం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆయా ఇళ్ల స్థితిగతులు, వాటిని హోమ్‌ స్టేకు అనుకూలంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశాలపై అధ్యయనం జరుగుతున్నది. ఆయా పనులను వేగవంతం చేసి ఈ ఏడాది పర్యాటక సీజన్‌ నాటికి అంటే అక్టోబరు నాటికి వాటిని హోమ్‌ స్టేకు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.


హోమ్‌ స్టేతో గిరిజనులకు ఆదాయం

గిరిజన గ్రామాల్లో వినూత్నంగా చేపట్టబోయే హోమ్‌ స్టే విధానంతో గిరిజనులకు చక్కని ఆదాయం లభిస్తుంది. గిరిజనులకు కొత్త ఇళ్లు మంజూరైతే, పాత ఇంటిని శిథిలం చేస్తున్నారు. అలాకాకుండా పాత ఇంటిని హోమ్‌ స్టేకు అనుకూలంగా తీర్చిదిద్దితే.. పర్యాటకులకు అద్దెకు ఇవ్వవచ్చు. పర్యాటకులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించడం ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి పెరుగుతుంది. తర్వాత వారికి ఆదాయం లభిస్తుంది. ఈకొత్త విధానంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధితో పాటు గిరిజనులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

జి.దాసు, జిల్లా టూరిజం అధికారి, పాడేరు

Updated Date - Aug 03 , 2025 | 07:50 AM