ఫేక్ సర్టిఫికెట్లపై ఏయూ దృష్టి
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:23 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో చేరిన విద్యార్థులపై అధికారులు దృష్టిసారించారు.

డిగ్రీ కోర్సుల్లో చేరిన ఇతర రాష్ర్టాల విద్యార్థులు
ఈక్వెలెన్స్, జెన్యూనిటీ సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశం
ఈ నెల 20 వరకూ అవకాశం
అవి పరీక్షించిన తరువాతే ఫలితాలు వెల్లడి
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో చేరిన విద్యార్థులపై అధికారులు దృష్టిసారించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఫేక్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన ఏయూ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్ టీవీ కృష్ణ ఏయూ పరిధిలోని డిగ్రీ కాలేజీలకు కీలక ఆదేశాలను జారీచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల ఈక్వెలెన్స్ (రాష్ట్రానికి చెందిన ఇంటర్మీడియట్ బోర్డుతో సమానంగా గుర్తించేలా) సర్టిఫికెట్, జెన్యూనిటీ సర్టిఫికెట్లను యూనివర్సిటీకి పంపించాలని ఆదేశించారు. ఆయా విద్యార్థులు ఈ రెండు సర్టిఫికెట్లను ఈ నెల 20వ తేదీలోగా వర్సిటీకి అందించాలని, వాటిని సరిచూసిన తరువాతే సదరు విద్యార్థుల ఫలితాలను వెలువరిస్తామని స్పష్టంచేశారు. తాజా ఉత్తర్వులతో ఫేక్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. తాజా చర్యలు ద్వారా భవిష్యత్తులో ఈ తరహా ప్రవేశాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో 20 మంది
కూటమి నుంచి పది మంది, వైసీపీ నుంచి పది మంది...
నామినేషన్ ఉపసంహరించుకున్న మహ్మద్ సాదిక్
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో 20 మంది నిలిచారు. కమిటీలో పది మంది సభ్యులను ఎన్నుకునేందుకు గత నెల 21న కమిషనర్ కేతన్‌గార్గ్ నోటిఫికేషన్ జారీచేయగా, 21 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారిలో కూటమి నుంచి 11 మంది, వైసీపీ నుంచి పది మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి జనసేన దూరంగా ఉంటున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ కార్పొరేటర్ (39వ వార్డు) మహ్మద్ సాదిక్ నామినేషన్ దాఖలు చేయడం కూటమి అభ్యర్థుల్లో కలకలం రేపింది. చివరకు జనసేన పార్టీ నేతల ఆదేశాలు మేరకు మహ్మద్‌సాదిక్ శనివారం అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ ఛాంబర్‌కు వెళ్లి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కూటమి నుంచి పది మంది, వైసీపీ నుంచి పది మంది మాత్రమే పోటీలో నిలిచినట్టయ్యింది. జీవీఎంసీ కౌన్సిల్‌లో కూటమికి 63 మంది, వైసీపీకి 34 కార్పొరేటర్ల బలం ఉంది. దీంతో కూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఆరో తేదీన ఎన్నిక జరగనున్నది.
పోటీలో ఉన్న అభ్యర్థులు... (బ్రాకెట్‌లో వార్డు, పార్టీ)
1. గంకల కవిత (48, బీజేపీ), 2. దాడి వెంకట రామేశ్వరరావు (89, టీడీపీ), 3. సేనాపతి వసంత (97, టీడీపీ), 4. మొల్లి హేమలత (5, టీడీపీ), 5. మాదంశెట్టి చినతల్లి (84, టీడీపీ), 6. గేదెల లావణ్య (17, టీడీపీ), 7. రాపర్తి త్రివేణివరప్రసాదరావు (93, టీడీపీ), 8.రౌతు శ్రీనివాసరావు (79, టీడీపీ), 9.మొల్లి ముత్యాలు (88, టీడీపీ), 10. కొణతాల నీలిమ (80, టీడీపీ), 11. నక్కెళ్ల లక్ష్మి (20, వైసీపీ), 12. సాది పద్మారెడ్డి (24, వైసీపీ) 13. పల్లా అప్పలకొండ (28, వైసీపీ) 14. బిపిన్‌కుమార్‌జైన్ (31, వైసీపీ) 15. గుండపు నాగేశ్వరరావు (40, వైసీపీ), 16. కోడిగుడ్ల పూర్ణిమ (41; వైసీపీ), 17. రెయ్యి వెంకటరమణ (51, వైసీపీ), 18. కేవీఎన్ శశికళ (55, వైసీపీ), 19. మహ్మద్ ఇమ్రాన్ (66 వైసీపీ), 20. ఉరుకూటి రామచంద్రరావు (70, వైసీపీ)
భారీగా మత్తు ఇంజక్షన్లు పట్టివేత
నాలుగు కిలోల గంజాయి కూడా...
ఒకరిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఒక ఇంట్లో భారీగా నిల్వ చేసిన మత్తు ఇంజక్షన్లతోపాటు నాలుగు కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి చర్యలు నిమిత్తం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన బిపిన్‌కుమార్‌ఘోష్ అలియాస్ ఆషిఫ్ అలియాస్ పెందుర్తి రాజు (36) గతంలో గంజాయి, మత్తు ఇంజక్షన్లు వినియోగించేవాడు. మత్తు ఇంజక్షన్లను రెండు మోచేతులపై చేసుకోవడంతో నరాలు దెబ్బతిని పనిచేయడం మానేశాయి. మత్తు ఇంజక్షన్లు, గంజాయి వాడితే ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరించడంతో కొంతకాలంగా వాటిని వినియోగించడం మానేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో తన నివాసాన్ని ఆర్‌అండ్‌బీ సమీపంలోని ఒక అపార్టుమెంట్‌కు మార్చాడు. మత్తుపదార్థాల వినియోగం ఆపేసినప్పటికీ తనకున్న పాతపరిచయాల ద్వారా గంజాయి, మత్తు ఇంజక్షన్లను తీసుకువచ్చి నగరంలో పలువురికి విక్రయించడం మొదలుపెట్టాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం నిఘా పెట్టి పెందుర్తి రాజు తన ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఆకస్మికంగా దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో నాలుగు కిలోలు గంజాయి, మత్తుకలిగించే పెంటాజోసిన్ ఇంక్షన్లు 900 లభ్యమయ్యాయి. తదుపరి చర్యలు నిమిత్తం నిందితుడితోపాటు సీజ్ చేసిన గంజాయి, మత్తు ఇంజక్షన్లను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.
తిరుపతి, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు కొనసాగింపు
సెప్టెంబరు నెలాఖరు వరకూ
నడపనున్నట్టు అధికారుల వెల్లడి
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని విశాఖ-తిరుపతి, విశాఖ-చర్లపల్లి మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక వారాంతపు రైళ్లను సెప్టెంబరు నెలాఖరు వరకూ నడపాలని నిర్ణయించినట్టు విశాఖపట్నం సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-తిరుపతి (08547) ప్రత్యేక రైలు ఈ నెల 6 నుంచి సెప్టెంబరు 24 వరకు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖ (08578) ప్రత్యేక రైలు ఈ నెల 7 నుంచి సెప్టెంబరు 25 వరకు ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-చర్లపల్లి (08579) ప్రత్యేక రైలు ఈ నెల 8 నుంచి సెప్టెంబరు 26 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి-విశాఖ (08580) ప్రత్యేక రైలు ఈ నెల 9 నుంచి సెప్టెంబరు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుతుంది.